జనసేన పార్టీ నుంచి విజయవాడ వెస్ట్‌ టికెట్‌ ఆశించిన పోతిన మహేశ్‌ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. న్యాయం చేస్తామని పవన్‌ కళ్యాణ్ బుజ్జగించినా కానీ వినిపించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మహేశ్‌ ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.సర్దుకుంటారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ సీటు బీజేపీకి దక్కింది. బీజేపీ తరపున సుజనా చౌదరి బరిలోకి దిగడం జరిగింది. మరోవైపు పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్‌ను జనసేన పార్టీకు ఇవ్వాల్సిందేనంటూ ఇటీవలే ఆందోళనలు కూడా చేశారు పోతిన. టికెట్ తనకే ఇవ్వాలంటూ పార్టీ ఆఫీస్‌లో 2 గంటల పాటు నిరసన దీక్ష కూడా చేపట్టడం జరిగింది. తనకు సీటు ఇవ్వడమే న్యాయం ఇంకా ధర్మమని వాదించారు పోతిన. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశానని, పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారు.


ఎన్ని ఇబ్బందులొచ్చినా కానీ జనసేన పార్టీ కోసం పనిచేశానని, పవన్‌ కళ్యాణ్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని భావించారు పోతిన మహేష్.విజయవాడ వెస్ట్‌ టికెట్‌ని పట్టుబడుతున్న పోతిన మహేష్‌తో మూడోసారి సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ బుజ్జగించేందుకు యత్నించారు. అధికారంలోకి వస్తే కీలకమైన పదవి ఇస్తామంటూ ఆయనకు భరోసా కూడా ఇచ్చారు. అయినా… విజయవాడ వెస్ట్‌ సీటు కావాల్సిందేనంటూ పోతిన మహేష్ పట్టుబట్టారు.అయితే పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారాయన. మూడు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలని, మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దామంటూ ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేశారు జనసేనాని పవన్‌కల్యాణ్‌.తాజా ప్రెస్‌ నోట్‌తో పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీలోని అసమ్మతులందరికీ కూడా షాక్‌ ఇచ్చినట్లైంది. ఎన్నో నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన జనసేన నాయకులందరికీ ఈ ప్రెస్‌నోట్‌ అనేది హెచ్చరికలా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: