గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనీకి లోకల్ సెగ బాగా తగులుతోంది. చిలకలూరి పేట నుంచి వలస వచ్చి. గుంటూరు వెస్ట్‌లో పోటీ చేస్తున్న రజనీ ఇక్కడ ప్రలోభాలకు గురిచేసేందుకు.. మహిళా ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. అయితే.. దీనిని స్థానికులు తిప్పికొడుతున్నారు. ``మేమేన్నా.. అమ్ముడు పోయేవాళ్లమా? `` అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. ఇది చిలకలూరిపేట కాదు.. గుంటూరు అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. కనీసం సమస్యలను ప్రస్తావించకుండానే ఓట్లు అడిగేందుకు ప్రయ త్నిస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున మహిళలు విమర్శిస్తున్నారు. నిజానికి ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినంత మాత్రాన నాయకుల గురించి ప్రజలకు తెలియంది ఏమీ కాదు. గత నియోజ కవర్గంలో ఎలా ? రియాక్ట్ అయ్యారు. అనేది ఖచ్చితంగా చూస్తారు. అంతేకాదు.. ఏం చేస్తారు ? ఏం చేయరు.. అనేది కూడా అంచనా వేసుకుంటారు.
ఈ విషయాలను మరిచిపోయి.. రజనీ.. ఏదో ఈ నియోజకవర్గం నుంచే తన రాజకీయాలు ప్రారంభిస్తున్న ట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అంగన్ వాడీ మహిళలు తమ సమస్యలను ప్రస్తావించినప్పుడు.. కనీసం వారికి సంఘీభావంగా ఓ మహిళా మంత్రిగా కూడా విడదల రజనీ స్పందించలేదని వారు వాపోతున్నారు. వేతనాలు పెంచాలన్న.. మునిసిపల్ కార్మికుల విషయంలోనూ ఆమె రియాక్ట్ కాలేదు. అంటే.. సమస్యలకు, ప్రజల అభిప్రాయాలకు ఆమె కడుదూరం అనే వాదననే వినిపించారు.
ఈ నేపథ్యంలో స్థానికులు రజనీ వ్యవహార శైలిపై నిప్పులు చెరుగుతున్నారు. చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించలేనప్పుడు.. మంత్రిగా ఉండీ మనసు రానప్పుడు.. ఇప్పుడు గుంటూరు వెస్ట్‌లో ఏం రాజకీయాలు వెలగబెడతారని వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో మాట తీరు కూడా ఆమెది బాగోదనే టాక్ వినిపిస్తోంది. ముందు మెత్తగా మాట్లాడతారని.. తర్వాత కనీసం పట్టించుకోలేరని చిలకలూరిపేట జనాలు చెబుతున్న కామెంట్లు గుంటూరు వెస్ట్ సీటులో వైరల్ అవుతుండడంతో రజనీకి సెగ పెరిగిందని అంటున్నారు పరిశీలకులు.