-పోలింగ్ లో వెనుకబడుతున్న పట్టణ ప్రజలు..
- ఓటు విలువ వారికి తెలియదా.?
- ప్రతి ఒక్కరం ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.!



ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశ భవిష్యత్తు మార్చాలన్న దేశం అభివృద్ధి బాటలో నడవాలన్నా, నువ్వు ఎన్నుకునే నాయకున్ని బట్టే ఉంటుంది. ఆ నాయకుని ఎన్నిక కూడా నువ్వు వేసే ఓటును బట్టే డిసైడ్ అవుతుంది. అంటే ఒక్క ఓటుపై దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట. అలాంటి విలువైన ఓటును ప్రస్తుత కాలంలో చాలామంది  అంగట్లో సరుకు లాగా అమ్ముకుంటున్నారు. చివరికి అనేక ఇబ్బందులు పడుతూ రాజకీయ నాయకులను ప్రశ్నించలేకపోతున్నారు. వారిచ్చే రూ:500, 1000 రూపాయలకు ఆశపడి  ఐదు సంవత్సరాల పాటు వారి కింద బానిసలుగా బతుకుతున్నారనేది జగమెరిగిన సత్యం.  ఇలా ఎంతో విలువ కలిగినటువంటి ఈ ఓటును  అమ్ముకోకుండా మనకు అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు అనేది చూసి మరి  ఓటు వేయాలి. కానీ ప్రస్తుత కాలంలో అది జరగడం లేదు.


 ఏ పార్టీ నాయకుడు ఎక్కువ డబ్బు ఇస్తే ఆ పార్టీ నాయకులకు ఓటు వేస్తున్నారు.ఆ నాయకుడు మనకు అంత డబ్బు ఎందుకు ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఖర్చుపెట్టి, తర్వాత ఐదేళ్లు  మనల్ని ఏ విధంగా పీక్కు తింటాడు అనేది ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఈ విధంగా ఓటుకు నోటు తీసుకొని  అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ప్రస్తుత కాలంలో చాలామంది  ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. అది ఎక్కడో కాదు, ఎంతో చదువుకున్న పట్టణ ప్రాంతంలో ఉండే ప్రజలే ఓట్లు వేయడానికి వెళ్లడం లేదట. ఎన్నికల కమిషన్ ఎంతోమంది, సినీ తారలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని  ప్రచారం చేసినా, కొంతమంది పట్టించుకోవడం లేదట.  నా ఒక్క ఓటు వేయకుంటే ఏమవుతుందిలే అనే ఆలోచనలోకి వెళ్లి వారి ఓటును చేతులారా వృధా చేస్తున్నట్టు తెలుస్తోంది.

 ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలను ఒక పండగ లాగా జరుపుకుంటారు. గంటల తరబడి లైన్ లో ఉండి మరి ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఇలా వ్యవసాయం, కూలి పని చేసే వీరికి ఉన్నంత ఇంగిత జ్ఞానం పట్టణాల్లో ఉండేటువంటి చదువుకున్న వారికి ఉండడం లేదు. ఓటు వేయాలంటే లైన్ కట్టాలి లైన్ లో గంటలు తరబడి నిలబడాలి అనే ఆలోచన వల్ల వారు ఓటు వేయడానికి  వెనక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పట్టణ ప్రాంతాల్లో చాలావరకు పోలింగ్ శాతం తక్కువ అవుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంటుంది. ఓటు వేయడంలో పల్లె ప్రజలకు ఉన్నంత అవగాహన పట్టణ ప్రజలకు ఎందుకు లేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పట్టణ ప్రజలు ఆలోచించి  ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని మనకు అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: