
బుధవారం తాడేపల్లిలో వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం అయిన జగన్.. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై, రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ` గత 11 నెలల్లో చంద్రబాబు పాలన, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు చూశాక నాలో చాలా మార్పు వచ్చింది. జగనన్న 2.0లో కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. ఇప్పటికే కార్యకర్తల్లో చైతన్యం వచ్చింది.. ఎన్నికల్లో ఓడినా కేడర్ ధైర్యంగా నిలబడింది.` అంటూ జగన్ కొనియాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడకు వెళ్లినా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు.. అదే ప్రభుత్వంపై వ్యతిరేకతకు సంకేతమని జగన్ అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదని.. ప్రజలకు హామీలు ఇస్తే తప్పకుండా నెరవేరుస్తానని జగన్ చెప్పుకొచ్చారు. అక్టోబరు తర్వాత నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నామని.. పార్టీ శ్రేణులందరూ కష్టపడి పనిచేస్తే రాబోయే రోజుల్లో వారి బాధ్యత తనదేనని జగన్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని.. ఈసారి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జగన్ పేర్కొన్నారు. 2027లో మళ్లీ పాదయాత్ర చేస్తానని.. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను బయటపెడతానని అన్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది వైసీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహిద్దామని పార్టీ నేతలతో జగన్ తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు