ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25న కుటుంబ సమేతంగా కుప్పం లో పర్యటించబోతున్నారు. కుప్పంలో చంద్రబాబు సొంతింటి కల సాకారం కాబోతోంది. మూడేళ్ల క్రితం చేపట్టిన ఇంటి నిర్మాణం పనులు తాజాగా పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మే 25న గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. చంద్రబాబు సొంత గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె అయినప్పటికీ.. కుప్పం ఆయనకు కంచుకోటగా మారింది.


1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 35 ఏళ్లుగా అక్కడి ప్రజలు చంద్రబాబును సొంత మనుషులా ఆదరిస్తున్నారు. ఎనిమిది సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిపించారు. అటువంటి కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోవడం పట్ల విపక్షాల నుంచి ఎన్నో విమ‌ర్శులు వ‌చ్చాయి. ఆ నియోజకవర్గాన్ని ఒక ఓట్ల యంత్రం గానే చూస్తున్నారు త‌ప్ప‌ అక్కడి ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆయన ఏ మాత్రం అనుకోవడం లేదంటూ విపక్ష నేతలు చంద్ర‌బాబును ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నారు.


ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావించిన చంద్రబాబు.. మూడేళ్ల క్రితం శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురం వద్ద కుప్పం-పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నారా భువ‌నేశ్వ‌రి ఎప్ప‌టిక‌ప్పుడు ఇంటి నిర్మాణ ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తూ వ‌చ్చారు. ఇక‌ నిర్మాణ ప‌నులు దాదాపు పూర్తి కావ‌డంతో.. ఈ నెల 25న కుప్పంలో నూతన గృహ ప్రవేశానికి చంద్ర‌బాబు సిద్ధమయ్యారు. ఈ శుభ‌కార్యంలో కుటుంబ‌స‌మేతంగా ఆయ‌న‌ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఇంటి నిర్మాణంతో పాటు కార్యాల‌యం కూడా అందుబాటులోకి రావ‌డంతో టీడీపీ శ్రేణుల్లో, నియోజ‌వ‌క‌ర్గ ప్ర‌జ‌ల్లో ఫుల్ జోష్ నెల‌కొంది.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: