
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ఓవైసీ సంపూర్ణ మద్దతు తెలిపారు. దీనిపై స్పందించిన పాకిస్తాన్ ట్రోలర్లు సోషల్ మీడియాలో ఓవైసీపై ట్రోలింగ్స్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓవైసీ స్పందిస్తూ.. “పాకిస్తానీలకు నేను దుల్హే భాయ్ (బావ) లాంటివాడిని” అని సరదాగా వ్యాఖ్యానించారు. వాళ్లకు నా లాంటి అందగాడు దొరకడని, వాళ్లకు నేను మాత్రమే మిగిలానని సెటైర్లు విసిరారు. తనను చూస్తూ ఉండాలని, తన మాట వింటూ ఉండాలని.. అలా చేస్తే వాళ్లకు జ్ఞానం పెరుగుతుందని, అజ్ఞానం తొలగిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ తరచూ అణ్వాయుధ బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయకులను చంపితే, ఆ దేశం నిశ్శబ్దంగా ఉండదని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. “పాకిస్తాన్ isis లాగా ప్రవర్తిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటే భారత్ ఊరుకోదని స్పష్టం చేశారు.
పహల్గాం ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కనీసం ఐదుగురు ఎంపీలున్న పార్టీలకు మాత్రమే ఆహ్వానం ఇచ్చారు. AIMIMకు నాలుగు మంది ఎంపీలు మాత్రమే ఉండడంతో ఓవైసీకి ఆహ్వానం అందలేదు. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి పోరాడిన ఓవైసీ చివరకు సమావేశానికి హాజరయ్యారు. అక్కడ కూడా ఆపరేషన్ సింధూర్‌కి మద్దతు తెలియజేశారు. ఆ తర్వాత దేశంలో ముస్లింలు కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఓవైసీ చేసిన పటిష్ఠమైన ప్రాతినిధ్యం కారణంగా కేంద్రం ఆయన్ను ఆపరేషన్ సింధూర్ పై వివరణ ఇవ్వడానికి అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో చేర్చింది. పాకిస్తాన్ విమర్శలకు వ్యతిరేకంగా ఆయన తరచూ స్పందిస్తున్న తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు.