బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌. భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ(బీసీవై) అధ్య‌క్షుడు. చిత్తూరు జిల్లా పుంగ‌నూరుకు చెందిన ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం..యువ‌త కోసం ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం లో పోటీ చేశారు. తాజాగా ఆయ‌న `ప్ర‌జల కోసం.. ప్ర‌గ‌తి కోసం` నినాదంలో ఉద్య‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలోనూ.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడ‌డంలోనూ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపిస్తున్న ఆయ‌న‌.. ప్ర‌జ‌ల కోసం ఒంట‌రి పోరాటానికి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న విద్యార్థి సంఘాల త‌ర‌ఫున ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో మెగా డీఎస్సీకి ఓకేచెప్పంది. సుమారు 16,343 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి ఇటీవ‌ల ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే.. దీనికి సంబంధించిన గ‌డువు కేవ‌లం 45 రోజులు మాత్ర‌మే ఉండ‌డంతో ఈ ఉద్యోగాల కోసం పోటీ ప‌డుతున్న వారు.. ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు త‌క్కువ స‌మ‌యం ఉంద‌ని.. ఈ స‌మ‌యం స‌రిపోద‌ని వారు చెబుతున్నారు. క‌నీసం 90 రోజ‌లు పాటు త‌మ‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు.


అయితే.. ప్ర‌భుత్వం మాత్రం ఈ గ‌డువు స‌రిపోతుంద‌ని.. ముందు నుంచి కూడా అభ్య‌ర్థులు ప్రిపేర్ అవుతున్నార‌ని.. కాబ‌ట్టి ఇప్పుడు స‌మ‌యం పెంచే ఆలోచ‌న చేయ‌లేమ‌ని చెబుతోంది. కానీ, విద్యార్థులు మాత్రం త‌మ డిమాండ్ల సాధ‌న కోసం.. ఉద్య‌మించే వారి కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ ఈ విష‌యంపై స్పందించ‌లేదు. పైగా.. అస‌లు ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌ను ఇటీవ‌ల విద్యార్థి సంఘాల నాయ‌కులు క‌లుసుకున్నారు. త‌మ ఆవేద‌న‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. త‌మ త‌ర‌ఫున పోరాటం చేయాల‌ని అభ్య‌ర్థించారు.


దీనికి స్పందించిన బోడే.. విద్యార్థుల త‌ర‌ఫున ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వానికి ఆయ‌న గ‌డువు విధించారు. విద్యార్థులు కోరుకుంటున్న‌ట్టుగా వారికి 90 రోజుల పాటు స‌మ‌యం ఇవ్వాల‌ని.. అప్పుడే ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని కోరారు. లేనిప‌క్షంలో తానే స్వ‌యంగా రోడ్డెక్కుతాన‌ని.. సీఎం ఇంటిని ముట్ట‌డిస్తాన‌ని అల్టిమేటం జారీ చేశారు. అదేవిధంగా నార్మ‌లైజేష‌న్‌ను అనుస‌రించాల‌ని డిమాండ్ చేశారు. అభ్య‌ర్థుల‌కు వ‌యో ప‌రిమితిని 46 నుంచి 47కు పెంచాల‌ని కూడా కోరారు. ద‌ర‌ఖాస్తులు, ఇత‌ర ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ కోసం..ప‌ది రోజులు వృథా అయ్యాయ‌ని.. కాబ‌ట్టి ప‌రీక్ష‌కు 90 రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో అభ్య‌ర్థుల త‌ర‌ఫున పోరాటం చేస్తామ‌ని చెప్పారు. సో.. మొత్తానికి ప్ర‌తిప‌క్షం చేయాల్సిన ప‌నిని బోడే చేయ‌డం గ‌మ‌నార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: