
గతంలోలా సరిహద్దుల్లో కాల్పులు, ఉగ్రవాదులను ఉసిగొల్పడాలు ఇప్పుడు కుదరవని భారత్ గట్టిగా తేల్చిచెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత బలగాలు జరిపిన రహస్య చర్యలు పాకిస్తాన్ లెక్కలన్నింటినీ తలకిందులు చేశాయి. మా ఎయిర్ బేసులనే టార్గెట్ చేసి కొట్టారని, మా ఉగ్రవాద ఫ్యాక్టరీలను నేలమట్టం చేశారని, అసలు అవేక్కడున్నాయో కూడా తెలియని ప్రదేశాల్లోకి చొచ్చుకొచ్చి దెబ్బతీశారని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వాపోవడమే దీనికి నిదర్శనం.
భారత బలగాలు యథేచ్ఛగా సరిహద్దులు దాటి వచ్చాయి, తమ పని పూర్తిచేసుకుని తిరిగి వెళ్లాయి, మేం చూస్తూ ఉండిపోయాం తప్ప ఏమీ చేయలేకపోయామని ఆయన అంగీకరించడం పాకిస్తాన్ పరువును బజారుకీడ్చింది.
ఒకప్పుడు ఇరు దేశాల మధ్య శాంతికి చిహ్నంగా భావించిన సిమ్లా ఒప్పందం ఇప్పుడు కేవలం ఓ చిత్తు కాగితంలా మారిపోయిందని పాకిస్తాన్ ఆక్రోశిస్తోంది. ఆ ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని గౌరవించుకోవాలి, కానీ భారత్ ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసింది. ఎల్ఓసీ అనేది కేవలం కాల్పుల విరమణ కోసం గీసుకున్న ఒక గీత మాత్రమే తప్ప, దానికి పవిత్రత లేదని భారత్ తన చేతలతో నిరూపించిందని పాక్ విలపిస్తోంది. భారత సైన్యం, వారి ఆయుధ సంపత్తి మా భూభాగంలోకి చొరబడితే ఆపలేని పరిస్థితుల్లో, ఇక సిమ్లా ఒప్పందానికి విలువెక్కడ ఉందనేది వారి ఆవేదన.
భారత్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. సహనంతో వేచి చూసే పాత పద్ధతికి స్వస్తి పలికి, దెబ్బకు దెబ్బ తీసే దూకుడును ప్రదర్శిస్తోంది. మీరు మా జోలికొస్తే, మీ ఇంట్లోకి చొరబడి మరీ కొడతాం అనే బలమైన సందేశాన్ని పాకిస్తాన్‌కు పంపింది. ఈ కొత్త సంప్రదాయం పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆడుతున్న ఉగ్రవాద నాటకానికి భారత్ తనదైన శైలిలో ముగింపు పలుకుతోంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏడుపు ప్రపంచానికి స్పష్టంగా వినిపిస్తోంది.