
బీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. సొంత రాజకీయాలను ప్రారంభించారు. తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం ముందుగా జాగృతిని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. జాగృతి పేరుతోనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ జండాను పక్కనపెట్టి జాగృతి పథకాన్ని ధరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆఫీసులో చేరికలు ఊపందుకున్నాయి.
ఇదే తరుణంలో తాజాగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో `లీడర్` పేరిట కవిత వినూత్న కార్యక్రమానికి తెర లేపారు. తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించడమే ఈ జాగృతి లీడర్ కార్యక్రమం యొక్క లక్ష్యం. మూడు రోజుల పాటు సాగే ఈ ట్రైనింగ్ క్లాసుల్లో లీడర్ అవ్వాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి.. ఎలా ప్రజా పోరాటాలు చేయాలి.. వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తారు.
ప్రస్తుతం ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కవిత ప్రారంభించారు. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే ఆలోచనలో కవిత ఉన్నారట. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. కవిత సొంతంగా జాగృతి తరఫున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసమే కవిత ఈ విధంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.