
కొంతకాలం క్రితం ఒక టీడీపీ ఎమ్మెల్యే కిలో చికెన్ పై 10 రూపాయలు, 20 రూపాయలు చొప్పున కమిషన్ వసూలు చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆ మహిళా ఎమ్మెల్యే కమిషన్స్ తీరు గురించి చంద్రబాబు నాయుడుకు సైతం ఫిర్యాదులు అందడంతో పాటు ప్రముఖ పత్రికల్లో పదుల సంఖ్యలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా మరో ఎమ్మెల్యే తీరు సైతం వివాదాస్పదం కావడం హాట్ టాపిక్ అవుతోంది.
ఉమ్మడి కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక ఎమ్మెల్యే ఇబ్బందులు సృష్టిస్తుండగా ఆ ఫ్యాక్టరీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఒక మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వేల సంఖ్యలో కార్మికులకు ఉపాధి లభించిందని ఏపీ హైకోర్టు పేర్కొంది.
అలాంటి పరిశ్రమ మూతపడితే అ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు అందరూ రోడ్డున పడతారని పరిశ్రమ మూత పడటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోతుందని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ పన్నులు పోతాయని అందువల్ల ఫ్యాక్టరీలో తిరిగి పనులు ప్రారంభమయ్యేలా భద్రతా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీ ఆవరణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మనుషుల సరుకుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిజిపి ఎర్రగుంట్ల సీఐ కడప ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలు ఒక విధంగా కూటమి సర్కార్ కు అవమానం అని చెప్పవచ్చు. అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఏం జరుగుతుందో ఈ ఘటనతో ప్రూవ్ అయింది. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు కూటమి సర్కార్ కు చెంపపెట్టు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రధాన నేతలు ఈ తరహా విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.