ఎన్నిసార్లు దెబ్బతిన్నా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. తోక కత్తిరించినా పాములా పగబడుతూనే ఉంది. భారత సైన్యం దెబ్బకు దిమ్మతిరిగి బెంబేలెత్తినా, తన విషపు నైజాన్ని మాత్రం వదులుకోవడం లేదు. సరిహద్దుల్లో శాంతికి నిప్పుపెట్టేందుకు మరో భారీ కుట్రకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను మరోసారి ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చేందుకు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ పైశాచిక క్రీడ మొదలుపెట్టింది. ఈ నక్కజిత్తుల కుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టి, పూర్తి ఆధారాలతో బయటపెట్టాయి.

గతంలో బాలాకోట్ దాడులతో పాటు, భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలకు మళ్ళీ జీవం పోసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ నడుం బిగించాయి. ఉగ్రవాద సంస్థలకు భారీ ఎత్తున నిధుల వరద పారిస్తూ, సరికొత్త శిబిరాల నిర్మాణానికి పచ్చజెండా ఊపాయి. పాత స్థావరాలు భారత్ రాడార్ కంట్లో పడటంతో, ఈసారి ఎవరూ ఊహించని ప్రదేశాల్లో, మరింత పకడ్బందీగా తమ కార్యకలాపాలు సాగించాలని దురాలోచన చేస్తున్నాయి.

భారత వైమానిక దాడుల నుంచి, నిఘా ఉపగ్రహాల నుంచి సులువుగా తప్పించుకోవాలన్నదే వీరి తాజా వ్యూహం. ఇందుకోసం నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో, దట్టమైన అటవీ ప్రాంతాలను తమ కొత్త అడ్డాలుగా మార్చుకుంటున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. లూని, పుట్వాల్, టైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రన్‌వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చెక్ జంగులోరా వంటి దట్టమైన అరణ్య ప్రాంతాల్లో ఈ కొత్త ఉగ్రవాద ఫ్యాక్టరీల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కేవలం శిబిరాలే కాదు, వాటికి అత్యాధునిక సాంకేతిక కవచాన్ని తొడుగుతున్నారు. దట్టమైన ఆకుల చాటున దాక్కున్నా స్పష్టంగా పట్టేసే ఫోలేజ్ పెనిట్రేటింగ్ రాడార్లు (FPR), చీకట్లోనూ మనుషుల ఉనికిని పసిగట్టే థర్మల్ ఇమేజర్లు వంటి అత్యంత ఆధునిక పరికరాలను ఈ క్యాంపుల్లో అమర్చేందుకు సిద్ధమయ్యారు. అంటే, భవిష్యత్తులో భారత సైన్యం గగనతలం నుంచి దాడికి ప్రయత్నిస్తే, వారి కళ్లుగప్పి తప్పించుకోవాలన్నది వీరి కుటిలనీతి.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే, దానిని యుద్ధంగానే పరిగణిస్తామని, మీ తాట తీయడానికి వెనుకాడబోమని ప్రధాని మోడీ ఇప్పటికే పాకిస్థాన్‌కు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. అయినాసరే, పాకిస్తాన్ మాత్రం పెడచెవిన పెట్టి, మళ్ళీ పాత రోగాన్నే ప్రదర్శిస్తోంది. భారత్‌లో అశాంతిని సృష్టించాలన్న ఏకైక అజెండాతో ముందుకు సాగుతోంది. అయితే, శత్రువు ప్రతీ ఎత్తుగడను ముందే పసిగట్టే మన నిఘా వ్యవస్థ, వారి కుట్రలను ప్రపంచం ముందు బట్టబయలు చేస్తోంది. పాకిస్తాన్ వేసే ప్రతీ అడుగునూ భారత్ నిశితంగా గమనిస్తూనే ఉంది. సరైన సమయంలో, సరైన రీతిలో జవాబిచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: