
ఇక ఇందులో విశాఖ మెట్రో పనులకు శిస్ట్రా కన్సల్టెన్సీ బాధ్యతలు స్వీకరించగా, విజయవాడ మెట్రో డిజైన్ మరియు పర్యవేక్షణకు టిప్సా ముందుకు వచ్చింది. ప్రధానంగా విశాఖపట్నం మెట్రో పనులకు మొదట టెండర్లు ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నెల జూలై 28 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆసక్తి గల సంస్థలు దరఖాస్తు చేసుకునే వీలుగా ప్రకటన వెలువడింది. మొదటి విడతలో ₹11,490 కోట్ల అంచనాతో మూడు కారిడార్లపై నిర్మాణం జరగనుంది. మొత్తం 42 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. మూడు సంవత్సరాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ మెట్రోకు సంబంధించిన టెండర్లు త్వరలోనే పిలవనున్నారు. మెట్రో ప్రాజెక్ట్ అమలులో కేంద్ర ప్రభుత్వం 20 శాతం నిధులను కేటాయించనుంది.
అదే మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 శాతం నిధులు వెచ్చించనుంది. మిగిలిన మొత్తం కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా సుదీర్ఘకాల రుణ సాయం తీసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం ఈ మెట్రో నిర్మాణాన్ని ఎన్నికల ముందు పూర్తి చేయాలనే లక్ష్యంతో వేగంగా నడుపుతోంది. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే అభివృద్ధికి పెద్ద బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ప్రజలందరూ ఎంతోకాలంగా ఎదురుచూసిన మెట్రో రైలు ప్రాజెక్టులు ఇప్పుడు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తున్నాయంటే, విశాఖ-విజయవాడ అభివృద్ధికి అసలైన శుభంకార్యం మొదలైంది అని చెప్పవచ్చు. "మెట్రో రైలు కూత ఇప్పుడు నిజం కానుందా? అభివృద్ధి రైలు స్టార్ట్ అయ్యిందా?" అంటూ ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.