కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అంతర్గత వివాదాలు పార్టీని కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా, ఎంత అనుభవంతో ముందుకు నడిపినా, ఈసారి సమస్యలు మాత్రం ఆయన సొంత ఎమ్మెల్యేల వల్లే వచ్చాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు … ఎన్నో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటుతూ వ్యవహరిస్తున్నారు. తాము గెలిచింది ఎవరి కృషి వల్లో మరిచి, నియోజకవర్గానికి తామే రాజులమని, తామే బాస్‌లమని చూపిస్తూ వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలకన్నా, ఎమ్మెల్యేల అజాగ్రత్త చర్యలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.


పాతకాలం – కొత్తకాలం తేడా .. చంద్రబాబు నాయుడు గత మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపించేవి కావు. అప్పటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండి, అవినీతి పనులకు పెద్దగా దూరంగానే ఉండేవారు. అవసరమైతే సహాయం చేసేవారు, కానీ నేరుగా అక్రమాలకు పాల్పడేవారు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యేలు నేరుగా నియోజకవర్గాల్లోనే దుకాణాలు తెరిచారు. ఇసుక, మద్యం, కాంట్రాక్టులు – ఏ విషయంలోనూ వేలు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అంతే కాకుండా అనుచరుల ముందు తాము ఎంత పవర్‌ఫుల్‌మో చూపించుకోవడానికి వీరంగం చేస్తున్నారు. ప్రజల వద్దే “చేతులు చాచడం” వరకూ దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కంట్రోల్ చేయలేని స్థితి .. ఇలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై కంట్రోల్ చేయడం ఇప్పుడు పార్టీ నాయకత్వానికి సులభం కాదు. ఒక్కరిని సస్పెండ్ చేస్తే మరో పదిమంది అదే తప్పులు చేస్తున్నట్లు బయటపడతారు. అందుకే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వార్నింగ్‌లతోనే సరిపెడుతున్నట్లు సమాచారం.


నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన నివేదికలు సేకరించుకుంటున్నారు. టిక్కెట్ కష్టమే .. అసలు శిక్షా చర్యలు ఇప్పుడు కాకుండా ఎన్నికల్లోనే ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లోనే చంద్రబాబు సీనియర్ నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. ఈసారి వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేలకూ అదే పరిస్థితి ఎదురవుతుందనే టాక్ పార్టీ అంతర్గతంగా వినిపిస్తోంది. అంటే … వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలామందికి టిక్కెట్ దొరకడం కష్టమే. ప్రస్తుతం మాత్రం… కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే కావడంతో, చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యే తప్పులను లెక్కగట్టి, క్రమంగా నో టిక్కెట్ జాబితా తయారు చేస్తున్నారట. అందుకే… ఇంకా నాలుగేళ్లు వీరు ఎంత వీరంగం చేసినా, పైకి వార్నింగ్‌లు మాత్రమే… కానీ నిజమైన శిక్ష మాత్రం ఎన్నికల రణరంగంలోనే పడనుందనే మాస్ టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp