వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో బయటికి కనబడక చాలా రోజులు అయింది. పులివెందుల జడ్పీటీసీ ఫలితాలు వచ్చిన రోజున అనంతపురంలో ఓ పెళ్లికి హాజరైన ఆయన, అక్కడ్నుంచి నేరుగా యలహంక వెళ్లారు. అప్పటి నుంచి ఆయన “హాట్ లైన్స్” కలుపుకునే పనిలో బిజీగా ఉన్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతోనూ, కాంగ్రెస్‌తోనూ ఆయన కదలికలు కొనసాగుతున్నాయట. ఒకరికి తెలియకుండా మరొకరితో చర్చలు జరపడం కష్టమైనా, తనకది తప్పదన్నట్లు డబుల్ గేమ్ ఆడుతున్నారు.


బీజేపీతో వన్ సైడ్ హాట్ లైన్ :
జగన్ రెడ్డి తప్పనిసరిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అటు నుంచి పట్టింపు ఎక్కువగా లేకపోయినా, ఆయన మాత్రం బీజేపీ వెనుకే తిరుగుతున్నారు . ఎన్డీఏ తనకు శత్రువు కాదని భావిస్తూ, “నాకు జైలు సమస్యలే ప్రధానమని .. మిగతా రాజకీయాలు తర్వాత” అనే లెక్కలో నడుస్తున్నారు. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి వెనుకంజ వేయలేదు. కానీ బీజేపీ పట్టించుకోకపోవడంతో, జగన్ ఇప్పుడు డబుల్ గేమ్ మొదలుపెట్టారని లోటస్ టవర్స్‌లో చర్చలు వినిపిస్తున్నాయి.



కాంగ్రెస్‌తో హాట్ లైన్ కోసం దరఖాస్తు :
ఇక కాంగ్రెస్ వైపు కూడా ఆయన దృష్టి సారించారు. ఇందుకోసం ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డిని ఢిల్లీకే పంపించి, ఖర్గేతో చర్చలు జరిపించారు. బయటకి రాకుండా స్వయంగా యలహంక నుంచి ప్లాన్‌ బట్టి మాట్లాడుతున్నారని అంటున్నారు. బీజేపీ వైపు వాలి ఉంటే పూర్తిగా నిర్వీర్యం అవుతామన్న భయం జగన్‌కి పట్టుకుందని, అందుకే కాంగ్రెస్‌తోనూ లైన్ కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ఎంతవరకు ఎంటర్‌టెయిన్ చేస్తుందన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది.



గోడ మీద పిల్లి రాజకీయాలు :
జగన్ రెడ్డి ఫ్యాన్స్ ఆయనను “పులి” అంటారు. సోనియాను ఎదిరించారని, మోదీని ఢీకొట్టారని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఆటగాళ్లు గోడ మీద పిల్లిలా కనిపిస్తున్నారు. విశ్వసనీయత పేరుతో రెండు వైపులా లైన్ వేసుకోవడం, ఎవరిని వదిలిపెట్టకుండా కదలికలు చేయడం.. ప్రజల కంటికి “ఇలా ఎలా?” అనే అనుమానమే రేపుతోంది. రెండు హాట్ లైన్స్ కోసం పరితపిస్తున్న జగన్‌కి చివరికి ఏ లైన్ దొరకదనే పరిస్థితి తలెత్తుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు సింహంలా పరిగెత్తిన జగన్ ఇప్పుడు గోడ మీద పిల్లిలా అటూ ఇటూ దూకుతూ కనిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: