
దీనికి ప్రధాన కారణం జగన్ ఇక్కడ ఉండకపోవడమేనని కార్యకర్తలు నమ్ముతున్నారు. సమయం మించిపోకముందే ఆయన శాశ్వతంగా తాడేపల్లికి తరలిరావాలని నేతలు, కార్యకర్తలు గట్టిగా కోరుతున్నారు. సీమలోనూ అదే సీన్: పట్టు సడలుతోందా? .. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలో చాలా దారుణమైన పరాజయం ఎదురైంది. కానీ ఓటు బ్యాంకు, పట్టున్న ఈ నాలుగు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాయలసీమలో చాలా తక్కువ సార్లు మాత్రమే జగన్ పర్యటించడం, నేతల మధ్య సఖ్యత కొరవడటం, కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పార్టీని మరింత బలహీనపరుస్తోంది. పటిష్టమైన క్యాడర్ ఉన్న సీమను ఇలా వదిలేస్తే రానున్న కాలంలో పార్టీ ఉనికికే ప్రమాదమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 'ఇంకా టైముంది' అని జగన్ చెబుతున్నా, అప్పటికి నష్టం తీవ్రత మరింత పెరిగే అవకాశముందని నేతలు కలవరపడుతున్నారు.
క్షేత్రస్థాయి నాయకత్వ లోపం: అస్తవ్యస్తంగా పార్టీ! .. పార్టీకి క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. బూత్ లెవెల్ కమిటీలను నియమించాలని ఆదేశించినా, ఆ కార్యక్రమాలు కార్యరూపం దాల్చలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జుల విషయంలోనూ ఇంకా జగన్ నుంచి క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారిన నేతలు పాత నియోజకవర్గాలకు వెళ్లడం లేదు. మరోవైపు, జోగి రమేష్ వంటి నేతలు తాము పోటీ చేసే స్థలాలను స్వయంగా ప్రకటించుకోవడం పార్టీలో అస్తవ్యస్తతకు నిదర్శనం. ఈ అన్ని సమస్యలకు తెరపడాలంటే, జగన్ బెంగళూరు వదిలి వచ్చి క్యాడర్‌కు అందుబాటులో ఉండాలి. లేదంటే, క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలహీనపడటం ఖాయమని, ఈ 'బెంగళూరు బెంగ' పార్టీని ముంచుతుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.