- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . . .

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటింగ్ శాతం ఈసారి కీలకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ సంఖ్య పూర్తి స్థాయిలో పోలింగ్ జరిగే రోజును బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆదివారం రోజున పోలింగ్ జరిగితే, ప్రజలు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మంగళవారం రోజున పోలింగ్ జరుగుతుండటంతో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు వంటి వర్గాలు ఓటు వేయడానికి పెద్ద ఎత్తున రావడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. ఉపఎన్నికలు సాధారణంగా సెలవు దినాలుగా ప్రకటించకపోవడం వల్ల ఓటర్ల హాజరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జూబ్లీహిల్స్ వంటి అర్బన్ ప్రాంతంలో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండటంతో వారు విధుల కారణంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.


మరోవైపు, ఉపఎన్నికలంటే చాలా మంది ఓటర్లు పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. గతంలో జరిగిన పలు ఉపఎన్నికల్లో కూడా తక్కువ శాతం ఓటింగ్ నమోదవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ ఆశలను మాస్ ఓటర్లపైనే పెట్టుకున్నాయి. మాస్ వర్గం అంటే బస్తీలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు సెలవు ఉన్నా లేకపోయినా తమ ఇష్టమైన పార్టీకి తప్పక ఓటేస్తారు. ఈసారి కూడా ఆ వర్గాన్నే టార్గెట్ చేస్తూ మూడు పార్టీలూ వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా బోరబండ, రహ్మత్ నగర్ వంటి ప్రాంతాల్లో పేద, కూలీ వర్గాలు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాలపై పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది.


అయితే వారిని ఆకర్షించేందుకు పార్టీల మధ్య “తాయిలాల” యుద్ధం మొదలైంది. ఓ పార్టీ ఓటర్లకు మాంసాహార కిట్లు పంపిణీ చేస్తోందని, ఇంకో పార్టీ చికెన్, మటన్ అందిస్తున్నదని ప్రత్యర్థులు ఆరోపణలు చేసుకుంటున్నారు. చివరి రోజు ఆదివారం జరిగే మాస్ కనెక్ట్ కార్యక్రమాలకు మూడు పార్టీలూ పెద్ద ఎత్తున నాయకులను దింపాయి. కేంద్ర మంత్రుల నుంచి మాజీ మంత్రుల వరకు, అలాగే కాంగ్రెస్ తరఫున జాతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటింగ్ రోజు మాస్ హాజరే ఫలితాన్ని నిర్ణయించే అంశంగా మారింది. ఎవరికి మాస్ మద్దతు ఎక్కువగా లభిస్తుందో, ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: