తెలంగాణ రాజకీయాలు, ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పార్టీలోని విభేదాలు, వ్యక్తిగత విమర్శలు శ్రుతి మించుతున్న నేపథ్యంలో కవిత ఈ 'మాస్ వార్నింగ్' ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత, తనను ఉద్దేశించి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. “పచ్చ వంకాయ, సచ్చు వంకాయ” అంటూ ఇంకొకసారి వాగితే “పుచ్చె లేచిపోతుందని” కవిత ఘాటుగా హెచ్చరించారు.
 

నిరంజన్ రెడ్డి చేసిన విమర్శలపై ఆమె ఫైర్ అవుతూ, ఇన్నాళ్లూ ఆయన వయసుకు గౌరవించి మౌనంగా ఉన్నానని, లేకుంటే ఎప్పుడో విమర్శించేదానినని పేర్కొన్నారు. తాను తన పని తాను చేసుకుంటూ పోతుంటే, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నిరంజన్ రెడ్డి అవినీతి కేసీఆర్‌కు తెలియదా? .. ఈ సందర్భంగా కవిత నిరంజన్ రెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. నిరంజన్ రెడ్డి అవినీతి గురించి పార్టీ అధినేత కేసీఆర్‌కు తెలియదా? అని ఆమె నేరుగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ దృష్టికి వెళ్లకుండా, ఆ అవినీతిని హరీశ్ రావు కాపాడారా? అంటూ ఎద్దేవా చేశారు. అయితే, నిరంజన్ రెడ్డి అవినీతి గురించి ఇంత వరకూ కేసీఆర్‌కు తెలియదనే తాను అనుకుంటున్నానని కవిత పేర్కొన్నారు.

 

అంతర్గతంగా పార్టీని బలహీనపరిచే ఇలాంటి నేతలు బీఆర్‌ఎస్‌లో ఉండటం మంచిది కాదని, నిరంజన్ రెడ్డి లాంటి నేతలను ఇప్పటికైనా పార్టీ పక్కన పెడితేనే పార్టీకి మంచిదని కవిత, బీఆర్‌ఎస్ నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత, బీఆర్‌ఎస్‌లో నాయకుల మధ్య సమన్వయం లోపించి, అంతర్గత విభేదాలు బయటపడుతున్న సమయంలో, కవిత లాంటి కీలక నేత బహిరంగంగా, మాజీ మంత్రికి ఇంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం పార్టీ భవిష్యత్తుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. కవిత హెచ్చరికల తర్వాత బీఆర్‌ఎస్ అధినాయకత్వం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుంది, నిరంజన్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: