తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో  రైతాంగం పలు చోట్ల  రోడ్డెక్కి ధర్నాలు,  నిరసనలు చేపడుతున్నారు . యూరియా కొరతను నిరసిస్తూ  జగిత్యాల జిల్లా రాయికల్ మండలం పరిధిలోని  భూపతిపూర్ కు చెందిన రైతులు కూడా ఇటీవల యూరియా కోసం రోడ్డు పై బైఠాయించి  ధర్నాకు  దిగిన విషయం తెలిసిందే . ఈ సందర్భంగా గిరిజన మహిళా రైతు బనావత్  లక్ష్మీ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాము ఓటు వేయలేదా ?... ఒక్క చింతమడక గ్రామస్థులకు పదిలక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేసి , తమకు ఎందుకు చేయరంటూ అసభ్య  పదజాలంతో దూషించడం సంచలనంగా మారింది .


 లక్ష్మి విమర్శలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో,  బనావత్  లక్ష్మీ పై టిఆర్ఎస్ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు . టిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు లక్ష్మి పై  కేసు నమోదు చేసిన పోలీసులు  అరెస్టు చేసి , ఆరు గంటల పాటు నిర్బంధించారు . పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన బనావత్   లక్ష్మి ఇప్పుడు మరొక వీడియోను విడుదల చేసింది.  ఈ వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో హల్, చల్   చేస్తోంది.  కేసీఆర్ ను  దూషించినందుకు  తనని  అరెస్టు చేసి ఆరుగంటలపాటు నిర్బంధంలో ఉంచిన పోలీసులు... హిందుగాళ్ళు, బొందుగాళ్ళు  అని దూషించిన  ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎందుకు అరెస్టు చేయరంటూ  ప్రశ్నించింది.


  బంగారు తెలంగాణలో తమలాంటి రైతులు కడుపుమండి తిడితే తప్పువచ్చిందని ,  కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూషిస్తే  తప్పు లేదా? అంటూ లక్ష్మి నిలదీశారు.  లక్ష్మీ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ వీడియో విడుదల వెనుక బీజేపీ ప్రమేయం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .  ఎందుకంటే హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అంటూ  గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా నిరసించిన  విషయం తెలిసిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: