అనగనగా రామాపురం అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయనకు వంద ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడితోట ఉన్నాయి. వాటిని చూసుకోవడానికి కొందరు తోటమాలులను నియమించాడు భూస్వామి సూరన్న..

మామిడి తోట బాగోగులను చూసుకోవటానికి రంగన్న అనే అతన్ని నియమించాడు. అతడు చాలా నిజాయితీ పరుడు. ఆ తోటను తన కన్న బిడ్డ వలె, కనురెప్ప వలె చక్కగా  చూసుకుంటున్నాడు.
   
ఒకరోజు సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. వేసవి కాలం కా.. రంగన్న ను  మామిడి పండ్లు తీసుకు రమ్మని కబురు పంపాడు సూరన్న .పెద్దవిగా ఉన్న పళ్ళను కోసి ఒక గంప నిండా తీసుకొచ్చి యజమాని ముందు ఉంచాడు రంగన్న.

ఇంట్లో వున్న వాళ్ళు అంతా పళ్ళు తీసుకుని తిన్నారు. వాటిలో అధికభాగం పండ్లు పుల్లగా ఉన్నాయి. ఆ విషయమే సూరన్నతో అన్నారు. ఆయనకు పట్టరాని ఆవేశం వచ్చింది. వెంటనే రంగన్నకు కబురు పంపాడు.  

"నువ్వు చాలా కాలంగా తోట పని చేస్తున్నావు. ఏ చెట్టు పండ్లు మధురంగా ఉంటాయి. ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయి అన్నది తెలియదా?"అంటూ సూరన్న.. రంగన్న ను మందలించాడు. అయ్యా ..! నేను కాపలా మాత్రమే కాసే వాడిని. ఏ చెట్టు ఫలం ఇంతవరకు నేను తినలేదు. ఏ చెట్టు పండ్లు పులుపో, ఏ చెట్టు పండు తీయనో నాకు తెలియదు. క్షమించండి! అని రంగన్న.. సూరన్న తో అన్నాడు. అతని నిజాయితీకి సూరన్న సంతోషించాడు. జీతం పెంచి,మంచి బహుమతి ఇచ్చి పంపాడు.

నిజాయితీ అనేది ఎలా ఉంటుంది అంటే , ఎవరైనా మనల్ని నమ్మి ఒక పనిని అప్పగించినప్పుడు , సవ్యంగా ఆ పనిని నెరవేర్చగలగాలి. అంతేకాదు బాధ్యతలను ఇచ్చిన వారిని బరువుగా భావించి ,వారిని మోసం చేయడం వల్ల ఎప్పటికైనా నష్టాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిజాయితీగా ఉన్నవారు ప్రస్తుతం కష్టాలను ఎదుర్కొన్నా, ఆ తర్వాత భవిష్యత్తులో సుఖంగా జీవిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: