ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్షీర విప్లవంలో కీలక  పాత్ర పోషించడమే కాకుండా సహకార వ్యవస్థలో నూతన అధ్యాయాలకు నాంది పలికి లక్షలాది రైతు కుటుంబాలకు ఆసరాగా, వేలాది మందికి ఉపాధి కల్పించిన పాల వీరయ్య గా, పాల వాళ్ళ ధూళిపాళ్ల గా ప్రసిద్ధి గాంచిన ప్రజానాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు. 



వీరయ్య చౌదరి 1942, 19 ఫిబ్రవరిన  గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా చింతలపూడి గ్రామంలోని  రైతు కుటుంబం లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్తయ్య , తులసమ్మ గార్లు. చిన్నతనం నుంచే పేద ప్రజానీకం కోసం పాటుపడే స్వభావం కలిగి ఉన్నారు.నిరంతరం ప్రజా సేవలో తరించాలని భావించి 23 ఏట రాజకీయాల్లో ప్రవేశించారు. 



తన 24వ ఏట(1968 లో) చింతలపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వీరయ్య చౌదరి గారు రాజకీయాల్లో వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత వరుసగా 1972, 1977లలో సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచిగా ఉన్న సమయాన గ్రామాన్ని అన్ని రంగాల్లో ఏంతో అభివృద్ధి చేశారు. గ్రామీణ సహకార వ్యవస్థ ప్రయోజనాల గురించి విస్తృతంగా తెలియజేసేందుకు తన స్వగ్రామాన్ని ప్రయోగశాలగా చేసుకున్నారు. 




1970 దశకంలో దేశవ్యాప్తంగా క్షీర విప్లవం వేగంగా అమలవుతున్న సమయంలో వీరయ్య వాటి మీద దృష్టి సారించారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ సాధించిన విజయాలను , అక్కడి పాడి రైతు గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.ఏ ఆధారం లేకపోయిన పాడి మీద బ్రతకవచ్చు అని భావించి గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంత రైతాంగానికి ఆసరాగా నిలిచేందుకు క్షిర విప్లవంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని భావించారు. 



 ఆలోచన వచ్చిన వెంటనే నాటి ముఖ్య నాయకులైన ఎన్.జి.రంగా, రఘురామయ్య, యడ్లపాటి వెంకట్రావు వంటి సహకారంతో క్షిర విప్లవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న సహకార పాల డైరీ వ్యవస్థ లలో గుంటూరు జిల్లాలో కూడా సహకార పాల డైరీ ఏర్పాటు కు యడ్లపాటి నేతృత్వంలో నాటి కేంద్ర మంత్రి రఘు రామయ్య ద్వారా అమూల్ సహకార పాల వ్యవస్థాపకుడు, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య ఛైర్మన్ గా ఉన్న కురియన్ ను కలిసి గుంటూరు జిల్లాలో సహకార పాల డైరీ ఏర్పాటు కు ఆమోదముద్ర వేయించారు. 



1977లో తెనాలి సమీపంలో ఉన్న సంగం జాగర్లమూడి గ్రామంలో స్వయంభూ వెలిసిన సంగమేశ్వర స్వామి పేరు మీద సంగం సహకార పాల డైరీ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి నాటి కేంద్ర మంత్రి రఘురామయ్య గారితో పాటుగా స్వయంగా కురియన్ గారు సంగం జాగర్లమూడి గ్రామానికి రావడం జాతీయ స్థాయిలో సంగం డైరీ  పేరు మారుమ్రోగింది. 



1977-79 వరకు సంగం డైరీ కార్యవర్గ సభ్యునిగా వ్యవహరించిన వీరయ్య చౌదరి గారు అప్పటి డైరీ ఛైర్మన్ యడ్లపాటి వెంకట్రావు గారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వారి వారసుడిగా ప్రజల ఆమోదంతో  1979లో సంగం డైరీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్య పదవి బాధ్యతలు చేపట్టారు. 




మనిషి పుట్టిన తర్వాత తొలి ఆహారం పాలు. అటువంటి పాలు లభ్యత నాడు తక్కువగా ఉండటం గ్రహించిన వీరయ్య చౌదరి గారు సంగం డైరీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాల ఉత్పత్తిని పెంచేందుకు , పాల సేకరణ , పాల శుద్ధి , మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధికి కృషి చేయడం ప్రారంభించారు. వారి తీసుకున్న చర్యల ద్వారా గుంటూరు జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి సైతం విజయవంతంగా పాల సేకరణ జరిగింది. 




సంగం డైరీని గుంటూరు జిల్లాకే తలమానికంగా నిలబెట్టడంలో వీరయ్య చౌదరి పాత్ర మరువలేనిది. 1979- 1985 వరకు మరియు 1992 - 1994 వరకు డైరీ ఛైర్మన్ గా పని చేసిన వీరు ఆ సంస్థ కి సుదీర్ఘ కాలం  ఏకగ్రీవంగా ఛైర్మన్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తి సైతం ఆయనే.తన దీక్ష దక్షతలతో డైరీని లాభాల బాటలో పయనించేలా చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో డైరీకి మంచి గుర్తింపు తెచ్చారు. పాడి పరిశ్రమ ద్వారా గుంటూరు జిల్లా గ్రామీణ రైతాంగం ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించడానికి సంగం పాల డైరీ ఛైర్మన్ ఏంతో కృషి చేశారు



1982లో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరయ్య చౌదరి గారు1983, 1985లలో పొన్నూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్య 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గా భాధ్యత లు నిర్వర్తించారు. ఎన్టీఆర్ కు అత్యంత ఆత్మీయుల్లో ఒకరిగా ఉంటూ గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. పార్టీ ఘనంగా నిర్వహించుకునే మహానాడు లలో తొలి సారిగా భారీ ఎత్తున ఎద్దుల పోటీలు నిర్వహించిన ఘనత సైతం  వీరికే దక్కుతుంది. 




ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కోరిక మేరకు 1985లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు గా బాధ్యత లు స్వీకరించిన వీరయ్య చౌదరి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార పాల డైరీల బలోపేతానికి మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది పాడి రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీరి హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు తర్వాత కాలంలో ఆ సంస్థ బలోపేతం కావడానికి దోహద పడింది. సమాఖ్య చైర్మన్ గా ఉన్న సమయంలోనే రాష్ట్ర ప్రజానీకానికి "పాల వీరయ్య" గా బాగా దగ్గరయ్యారు.  




రాజకీయాల్లో వీరయ్య చౌదరి ది అరుదైన వ్యక్తిత్వం ,రాజకీయ ఉద్ధండుల పురిటి గడ్డ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకంలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని రాజకీయాల్లో అజాత శత్రువు గా నిలిచారు. అవినీతి , బంధుప్రీతి , పదవుల కోసం వెంపర్లాడటం వంటి వాటికి చివరి వరకు ఆమడ దూరంగా నిలుస్తూ వచ్చారు. 




వీరయ్య చౌదరి గారు ఆది నుండి గ్రామీణ ప్రాంతాల రైతాంగ సంక్షేమం, సహకార వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా చేసుకొని చివరి వరకు చేసిన నిర్విరామ కృషి కారణంగానే ఈరోజు సంగం పాల డైరీ కీలక సాక్ష్యం.సహకార రంగంలో వీరి కృషిని గుర్తిస్తూ స్విట్జర్లాండ్ లోని  ప్రముఖ బాసెల్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డాక్టర్ నికోలాయ్ కామినోవ్ గారు తన అంతర్జాతీయ సహకార రంగ వ్యాసాల్లో ప్రస్తావించారు. 

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి లో  కీలకమైన పాత్ర పోషించిన వీరయ్య చౌదరి గారు 1994 జనవరి 24వ తేదీన గుంటూరు జిల్లాలోని నారా కోడూరు లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన మానసపుత్రిక సంగం డైరీ మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎందరో గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి అండగా నిలుస్తూనే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: