
అవును ఒకపుడు జనాలు కలికాలం అని తలచుకునే వారు. అలాంటిది ఇపుడు కరోనాకాలమని చెప్పుకోవాల్సొస్తోంది. జరగరానిది జరిగినా, చూడలేమనుకున్నది చూసినా, మానవత్వం అడుగంటిపోతున్నా పెద్దవాళ్ళు ‘ఏం చేస్తాం అంతా కలికాలమ’ని సర్ది చెప్పుకునేవారు. అలాంటిది కలికాలంపోయి ఇపుడు కరోనాకాలం అనుకోవాల్సొస్తోంది. ఎందుకంటే కలికాలాన్ని కరోనాకాలం మించిపోయింది కాబట్టే. కరోనా వైరస్ కారణంగా మనుష్యుల మధ్య ఉన్న బంధాలు, ప్రేమలు పటాపంచలైపోతున్నాయి. అయినవాళ్ళు ఆసుపత్రుల్లో చేరినా, చనిపోయినా బంధు,మిత్రులు కాదు చివరకు కుటుంబసభ్యులు కూడా దూరంగానే ఉండిపోవాల్సొస్తోంది. అలాగే ప్రాణాధారమైన మందులు కూడా బ్లాక్ మార్కెట్ కు వెళిపోతున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా మనుషుల మధ్యున్న ప్రేమబంధం ఎంత బలంగా ఉందో బయటపడుతోంది. కుటుంబసభ్యుల్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియలు చేయటం కష్టంగానే ఉంటోంది. అంత్యక్రియలు కుటుంబసభ్యుల చేతుల మీదగా కాకుండా చాలాచోట్ల మున్సిపల్ సిబ్బంది చేతుల్లోనే జరిగిపోతోంది. ఆసుపత్రుల్లో చేరిన రోగులను బతికించటం కోసం చివరి ప్రయత్నంగా డాక్టర్లు వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించి బతికించే ప్రయత్నాలు చేసేవారు. అయితే ఇపుడీ ఆక్సిజన్ కారణంగానే రోగుల ప్రాణాలు పోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడికి బాగా తెలుసు. తెలిసినా కూడా కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఐదురాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకోసం ప్రయత్నాలు చేయటంలో బీజీగా గడిపేశారు. అంటే పంటను కాపాడాల్సిన చేనే పంటను మేసిందని అర్ధమవుతోంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రధానమంత్రే వారి ప్రానాలను పణంగా పెట్టేశారు.
ప్రజలందరినీ సమానంగా చూసుకోవాల్సిన ప్రధానమంత్రి కరోనా వైరస్ టీకాల పంపిణీ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా ఒంటెత్తుపోకడలు పోతున్నారంటు ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. ప్రజలందరికీ టీకాలు వేయించే విషయంలో కేంద్రం ఎప్పుడో చేతులెత్తేసిన విషయం అర్ధమైపోతోంది. అలాగే లాక్ డౌన్ పెట్టే విషయాన్ని కూడా రాష్ట్రాలకు అప్పగించేసి బాధ్యతల నుండి తప్పుకున్నది. ఇక ఆసుపత్రుల్లో చనిపోతున్నవారిని సమూహాలుగా దహనం చేసేస్తున్నారు. శవసంస్కారాలు చేయటానికి చాలా పట్టణాల్లో స్ధలం కూడా సరిపోవటంలేదట. కరోనా నియంత్రణలో మార్గదర్శకాలను జనాలు కూడా పట్టించుకోవటం లేదు. ఫలితంగానే కరోనా వైరస్ ఉదృతి పెరిగిపోతోంది. ఏమి చేస్తాం కరోనా కాలమని సరిపెట్టుకోవాల్సిందే.