ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌... తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలనైనా విశ్లేషించగల మేధావిగా పేరున్న వ్యక్తి. స్వయంగా ఎమ్మెల్సీగా రెండు సార్లు గెలిచారు. యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తూనే ప్రపంచంలోని అనేక విషయాలపై తనదైన విశ్లేషణ అందిస్తుంటారు. ఇలాంటి విశ్లేషణలు చేసేటప్పుడు కొన్ని విమర్శలు కొందరిని అసంతృప్తికి గురి చేయొచ్చు. ఇప్పుడు అదే జరిగింది. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తాజాగా చేసిన ఓ వీడియోలో సీఎం జగన్ తీరును.. ఆయన ప్రవేశ పెట్టిన నగదు పంపిణీ పథకాలను తీవ్రంగా విమర్శించారు.


ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం పేరిట నగదు పంపిణీ శ్రుతి మించుతోందని ఆయన విశ్లేషించారు. తాజాగా సీఎం జగన్ కాపు నేస్తం పేరిట... 45 ఏళ్లు దాటిన మహిళలకు రూ. 15 వేల రూపాయల నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జగన్ తాను అమలు చేస్తున్న పథకాలన్నీ ఈ నగదు పంపిణీ కార్యక్రమంలో చెప్పుకొచ్చారని.. అవన్నీ వింటే.. అసలు ఇలా నగదు బదిలీ చేసేందుకు సీఎం అవసరమా.. ఓ అకౌంటెంట్ ఉంటే చాలు కదా అంటూ సెటైర్‌ వేశారు. ఇలా ప్రభుత్వం తన ఆదాయాన్నంతా పంచుకుంటూ వెళ్లాలని నిర్ణయిస్తే.. ఇందుకు ఓ అకౌంటెంట్‌ సరిపోతాడని.. ఆ పని అతడు ఇంకా చక్కగా చేస్తాడని అన్నారు.


వాస్తవానికి కె. నాగేశ్వర్.. కాపు నేస్తం నగదు పంపిణీని సందర్భంగా తీసుకుని దేశంలో అమలవుతున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాల పోకడలపై ఘాటుగా విమర్శించారు. ఇక ముందు ముందు.. పుట్టిన పసిపాపకు కూడా వృద్దాప్య ఫించన్ ఇస్తారేమో అని వ్యంగ్యంగా అన్నారు. ఈ లెక్కకు మించిన పథకాల ద్వారా ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు తప్ప.. వారి కాళ్లపై వారు నిలబడేలా అవకాశాలు సృష్టించడం లేదని ఆయన విమర్శించారు.


ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం అందిస్తే.. ఇప్పడు కిలో బియ్యం రూపాయికి అందించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఈ సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడని విధంగా తయారు చేయాల్సిన ప్రభుత్వాలు.. ఆ విషయం మరచి రాజకీయ లబ్ది చూసుకుంటున్నాయన్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 85 వేల వ్యూస్‌ రాగా.. వందల సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: