ఉగాది అనగా తెలుగువారి సిసలైన పండుగ. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో అందరం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం అలవాటు అయింది కానీ, నిజానికి మన తెలుగు సంత్సరానికి ఆరంభం ఉగాది. ఈ పండుగకు పురాణాల్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని, అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

 ఇక ఉగాది అనగానే అందరికీ గుర్తు వచ్చేది..షడ్రుచుల పచ్చడి.. ఉగాది భావాన్ని తెలుపుతూ షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఉగాది పచ్చడి లో ఇమిడి ఉంది . "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా నిలిచే ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని "ఉగాది పచ్చడి " ఇస్తుంది.

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది. బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం, ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం, వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు, చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు, కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.. ఇలా ప్ఛది లో వాడే ప్రతి పదార్థం కూడా ఒక్కో భావాన్ని తెలుపుతుంది. ఇక ఉగాది పచ్చడికి శాస్త్రాలలోనూ, పురాణాలలోనూ చాలా ప్రత్యేకం ఉంది.

 ఉగాది పచ్చడిని మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. "త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు" ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

 .

..

మరింత సమాచారం తెలుసుకోండి: