ముస్లింలు అనుసరించే ఇస్లామీ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించిందని వారు నమ్మడమే. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో కూడి ఉంటుంది. మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు ఖురాన్ చెబుతోంది. 




ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ముస్లిం సోదరులు. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు ముస్లిం సోదరులు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాస దీక్షలో ఉంటారు. 




ఉపవాస దీక్షలు(రోజా)సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తుంది. రంజాన్‌ ఆఖరు పది రోజులు ఇళ్ళు వదలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్‌ గురించి ప్రార్థనలతో ఆథ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. రంజాన్‌ పండుగను ఈదుర్‌ ఫితర్‌ అని అంటారు. నెల పొడుపు చంద్రుని దర్శించిన తరువాత రోజు ఉదయం ఈ పండుగను జరుపుకొంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. ఆరోజుతో వీరి నెలరోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది.. ఆకలి అంటే ఎంత కఠీనంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే ఉద్దేశంతోనే ఈ రంజాన్ 'రోజా' ఉపవాసదీక్షలు అనే సూత్రాన్ని పాటిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: