దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. హిందువులంతా భక్తి శ్రద్ధలతో సెప్టెంబర్ 10 నుంచి పదకొండు రోజుల పాటు వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడిని భక్తులు పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు. అందులో ఒక్కో పేరు వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. మరి ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారు తెలుసా ? పురాణ కథల ప్రకారం వినాయకుడి దంతం ఒకటి విరగడం కారణంగా ఏకదంతుడు అని పిలుస్తారు. ఇతిహాసాల ప్రకారం నాకు ఆ పేరు రావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే...

పరశురాముడు, వినాయకుడి మధ్య జరిగిన యుద్ధం. వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అంటే... ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాస పర్వతానికి చేరుకున్నారట. అయితే అక్కడే తలుపు వద్ద నిలబడి వున్న వినాయకుడు ఆయనను లోపలి వెళ్ళకుండా అడ్డుకున్నాడట. పరశు రాముడు ఎంత వేడుకున్నా వినాయకుడు వినలేదట. దీంతో కోపం వచ్చిన పరశురాముడు వినాయకుడిని యుద్ధం చేయమని సవాలు చేశాడట. వినాయకుడు కూడా ఆయన సవాలును స్వీకరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు.


అలా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుండగా పరశురాముని గొడ్డలి కారణంగా వినాయకుడి దంతం విరిగిపోయిందట. దీంతో వినాయకుడు బాధతో విల విల లాడుతూ అరవడం పార్వతీ దేవికి కోపం తెప్పించిందట. ఆమె కోపంతో దుర్గామాతగా ఉగ్ర రూపం దాల్చడం చూసి పరశురాముడు తాను చేసిన తప్పు తెలుసుకున్నాడట. చేసిన తప్పును క్షమించమని ఆమెను వేడుకున్నాడు. అంతేకాకుండా పరశురాముడు వినాయకుడికి తన తేజస్సు బలం, నైపుణ్యం, జ్ఞానం లభిస్తుందని ఆశీర్వదించాడట. అందుకే వినాయకుడి ఆశీస్సులు ఉంటే విద్య సులువుగా వస్తుందని నమ్ముతారు. ఇక అప్పటి నుంచి వినాయకుడిని ఏకదంతుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు. వినాయకుడి 'ఏకదంతుడు' పేరు వెనక ఉన్న అసలు కథ ఇదన్న మాట !

మరింత సమాచారం తెలుసుకోండి: