కులం, మతం ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునే పెద్ద పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. దేశవ్యాప్తంగా వినాయకుడి పండుగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. రకరకాల పిండివంటలతో దేవునికి నైవేద్యం చేయడానికి, కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒకే చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి సందర్భంలోనే పిల్లలకు తెలియని ఎన్నో విషయాలను కథల రూపంలో చెబుతారు ఇంటి పెద్దలు, మరీ ముఖ్యంగా వినాయకుడు అనగానే అందరికీ తొండం ఎంత ప్రత్యేకంగా గుర్తుకు వస్తుందో, గుంజిల్లు కూడా అంతే ప్రత్యేకంగా గుర్తుకు వస్తాయి. సాధారణంగా ఏదైనా తప్పు చేస్తేనే గుంజులు తీస్తారు. మరి ఎందుకు వినాయకుడి గుడిలోనైనా, వినాయకుడి విగ్రహం ముందునైనా గుంజలు తీయమంటారు? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


పార్వతీ దేవి, శ్రీ మహావిష్ణువు అన్నా-చెల్లెలు అని ఇది అందరికీ తెలుసు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన పరమేశ్వరుని కలవడానికి కైలాసానికి వెళ్ళారు. అక్కడ తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, ఇతర ఆయుధాలను పక్కన పెట్టి లోపలికి వెళ్ళారు. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉండేవాడు. గణపతి చాలా అల్లరివాడు, ఇది అందరికీ తెలిసిందే. మంచి భోజనం ప్రియుడు కూడా. పైగా మన బొజ్జ గణపయ్యకు ఆకలి వేస్తే, ఏది ఉందో అది తినేస్తాడు. అప్పుడు బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం అతని కంటికి కనిపించింది. ఆయనకోసం పార్వతి దేవి చేసిన మురుకుల చక్రంలానే కనిపించింది కాబట్టి వెంటనే నోట్లో వేసి మింగేసాడు. అమాయకంగా కూర్చున్న గణపతిని చూసి మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణుమూర్తి “ఎక్కడ ఎక్కడ?” అంటూ వెతకడం మొదలుపెట్టారు.



అప్పుడు బొజ్జ గణపయ్య అడిగాడు:“ఏం వెతుకుతున్నావు మామయ్య?”

మహా విష్ణువు : “ఇక్కడే నా సుదర్శన చక్రం పెట్టాను,  కనిపించట్లేదు, ఎక్కడ పెట్టానో అని వెతుకుతున్నాను.”

అప్పుడు బొజ్జ గణపయ్య అమాయకంగా అడిగాడు: “గుండ్రంగా ఉంటుంది, నొక్కులు నొక్కులు గా ఉంటాయి, అదేనా మామయ్య?”

మహా విష్ణువు :“అవును, అదే.”

మంచి హాస్యంతో బొజ్జ గణపయ్య చిరు దరహాసం చేస్తూ: “మామయ్య, నేను నోట్లో వేసుకున్నాను!” అని నవ్వుతూ చెప్పాడు.
అసలే, గణపయ్య అల్లరి వాడు..చిన్నారి రూపంలో చిలిపి చేష్టలు చేస్తే, కోపం వస్తుందా? ముద్దుగా మాట్లాడితే ముద్దొస్తుంది. జగమేలే మామయ్యకి మయోపాయలకి ఏం తక్కువ..? చిన్నారి గణపతిని మాటల్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ తన కుడి చేతితో తన ఎడమ చెవిని తన ఎడమ చేతితో కూడిచెవిని పట్టుకొని గణపతి ముందర గుంజలు తీయడం ప్రారంభించారు.  ఇదేదో విచిత్రంగా ఉందే భలే గమ్మత్తుగా ఉందే అంటూ పకపకా నవ్వేసాడు . గణపయ్య ఎంత పకపకా నవ్వాడు అంటే కడుపునొప్పి వచ్చే అంతగా నవ్వేశారు . అలా నవ్వుతూ ఉండగా ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం అదే అదును తన్నుకొని బయటకు వచ్చేసింది . చక్రం చిక్కింది రా బాబు అంటూ ఊపిరిపీల్చుకుని మహా విష్ణువు ఆ చక్రాన్ని తీసుకునేసారు . అప్పట్నుంచి గణపతి ముందు గుంజలు తీసే పద్ధతి ఓ సాంప్రదాయం లా వచ్చింది.  ఈ విధంగా గణపతి ముందు గుంజలు తీసి, తమ కోరికలను నిజాయితీగా కోరుకుంటే, ఆ కోరికలు నెరవేర్చబడతాయి. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: