
అయితే వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ లాంటి టీం తో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా న్యూజిలాండ్ విజయం వరిస్తుంది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఊహించని రీతిలో న్యూజిలాండ్ జట్టుకు మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా బంగ్లాదేశ్ జట్టు చేతిలో ఘోర పరాభవం చవిచూసింది కివిస్. సొంత గడ్డపై బంగ్లాదేశ్ ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవల బంగ్లాదేశ్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో న్యూజిలాండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.
నాలుగు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది కివిస్ టీమ్. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్ లో 172/10, 144/10 పరుగులు చేసింది. అయితే కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులు చేయగా.. గెలుపు కోసం 137 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక దశలో 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది న్యూజిలాండ్ జట్టు. ఇలాంటి సమయంలో ఫిలిప్స్ 40 శాంట్నర్ 35 పరుగులతో జట్టును ఆదుకొని విజయతీరాలకు నడిపించారు. దీంతో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ 1-1 తో సమంగా మారిపోయింది అని చెప్పాలి.