టీమిండియా పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం భారత క్రీడా ప్రపంచంలో పెద్ద చర్చకే దారితీసింది. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆటగాడు, ధోనీ ఫ్రెండ్ సురేష్ రైనా ఓ సంచలన డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. "విరాట్ కోహ్లీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ఇవ్వాలి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇప్పటివరకు, భారత క్రీడా చరిత్రలో ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నది ఒకే ఒక్కరు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును ప్రతిపాదించగా, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ గౌరవాన్ని అందించారు. సచిన్‌కు ముందు గానీ, ఆ తర్వాత గానీ మరే క్రీడాకారుడికీ ఈ అరుదైన గౌరవం దక్కలేదు.

అయితే, ఇప్పుడు కోహ్లీకి కూడా అదే రీతిలో గౌరవం దక్కాలని సురేష్ రైనా గట్టిగా వాదిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, "విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంతో సాధించిపెట్టాడు. దేశం కోసం, ఈ ఆటకు అతను చేసిన సేవలకు గాను అతనికి భారతరత్న ఇవ్వాలి. భారత ప్రభుత్వం అతడిని ఈ పురస్కారంతో సత్కరించాలి" అని రైనా డిమాండ్ చేశారు.

ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం అంత సులువైంది కాదని, కానీ సరైనదని భావిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. "ఈ ఫార్మాట్‌కు నా సర్వస్వం అర్పించాను. నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇది నాకు ఇచ్చింది. ఈ ఆటకు, నా సహచరులకు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలతో నిష్క్రమిస్తున్నా" అని కోహ్లీ రాసుకొచ్చాడు.

36 ఏళ్ల విరాట్ కోహ్లీ, భారత్ తరఫున 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 46.85 సగటుతో 30 సెంచరీలతో సహా 9,230 పరుగులు సాధించాడు. గత ఏడాదే టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకున్న కోహ్లీ, ఇకపై కేవలం వన్డే మ్యాచ్‌లపైనే దృష్టి సారించనున్నాడు.

ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ (డిసెంబర్‌లో), రోహిత్ శర్మ (గత వారం) టెస్టుల నుంచి రిటైర్ కాగా, ఇప్పుడు కోహ్లీ నిష్క్రమణతో భారత టెస్ట్ క్రికెట్‌లో ఓ శకం ముగిసినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: