చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐదు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై జట్టు స్థిరమైన ప్రదర్శనతో ఐపీఎల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో సీఎస్కే ఎన్నో సార్లు ప్లే ఆఫ్స్ చేరింది.. ఎన్నో రికార్డులు సృష్టించింది. అయితే 2025 సీజన్ మాత్రం వారికే ఓ తీవ్ర ఆవేదనను మిగిలించింది. ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు 12 మ్యాచ్‌లు ఆడగా, కేవలం 6 పాయింట్లు మాత్రమే సంపాదించింది. వారి ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన సీజన్‌లలో ఒకటిగా నిలిచింది. మొదటగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన జట్టుగా చెన్నై నిలిచింది. అయితే, మహీ కూల్ గా దీన్ని స్వీకరిస్తూ భవిష్యత్‌ పట్ల దృష్టిపెట్టాడు.

మే 20న ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ముందు ధోనీ మాట్లాడుతూ.. తమ పునర్నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని వెల్లడించాడు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో వారు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తపరిచే విధంగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బ్యాటింగ్ విభాగంలో ఆటగాళ్లు తమ ప్రతిభను పూర్తిగా చూపించే అవకాశం కావాలి. అదే మేము చివరి కొన్ని మ్యాచ్‌లలో చేశాం. అదే దిశగా ముందుకు సాగాలి అని ధోనీ అన్నారు.

అలాగే బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. పవర్‌ప్లే అనంతరం బౌలింగ్ చేయగల మరో బౌలర్ అవసరమని ధోనీ అభిప్రాయపడ్డారు. సీజన్ ప్రారంభంలో చెన్నై బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు వారు దానిని అధిగమించినట్లు ధోనీ చెప్పారు. ఓ దశలో టోర్నీ నుంచి బయటపడిన తర్వాత, మేము సమాధానాల కోసం వెతికాం. సరైన కాంబినేషన్‌తో, ఆక్షన్ కోసం టార్గెట్ చేసే ఆటగాళ్లను గుర్తించడం ముఖ్యం. ఆటగాళ్లు తమ స్థానాన్ని బలపడేలా చేయాలి. టోర్నీ నుండి నిష్క్రమించిన తర్వాత ఒత్తిడి తగ్గిన నేపథ్యంలో, ఆటగాళ్లు తమ ఆటను స్వేచ్ఛగా ఆడవచ్చని ధోనీ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి మ్యాచ్‌లలో మేము స్వేచ్ఛగా మన ప్రతిభను ప్రదర్శించవచ్చు. ఒత్తిడి లేకపోతే ఆటగాళ్లు మంచి క్రికెట్ షాట్లు ఆడి మంచి స్ట్రైక్‌రేట్‌తో రాణించవచ్చు అని అన్నారు ధోనీ. ఇక రాజస్థాన్‌తో మ్యాచ్‌కు చెన్నై అన్‌చేంజ్డ్ జట్టునే కొనసాగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న CSK, ఈ మ్యాచ్‌ను తమ కొత్త దిశలో ప్రయోగం చేసే అవకాశంగా తీసుకుంది. ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం, ఎవరు భవిష్యత్‌ కోసం సరైన ఎంపికవుతారో తెలుసుకోవడం సీఎస్కే లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు నిరాశే అయినా, ధోనీ నేతృత్వం మరోసారి క్లాస్ చూపించింది. ఓటమి వచ్చినప్పటికీ, ఎలా తిరిగి విజయం సాధించాలో ఈ జట్టు ప్రణాళిక చూపిస్తోంది. రాబోయే సీజన్లలో పునర్నిర్మిత చెన్నై మళ్లీ పాత గోల్డెన్ ఫామ్‌ను అందుకుంటుందా?



మరింత సమాచారం తెలుసుకోండి: