ఆస్ట్రేలియా పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రతిభ చూపించి మూడు వన్డేల సిరీస్‌ను 2 - 0 తేడాతో గెలుచుకుంది. రెండు మ్యాచ్‌లు ముగిసిన వెంటనే సిరీస్ తమ ఖాతాలో వేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు, బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం చాటింది. ఆతిథ్య ఆస్ట్రేలియాపై వరుస విజయాలు సాధించడం ప్రోటియాస్‌కు గౌరవప్రదమైన ఘనత అని చెప్పాలి. మొదటి వన్డే లో దక్షిణాఫ్రికా 296 పరుగులు సాధించగా , ఆస్ట్రేలియా 198 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో కెశ‌వ్ మహారాజ్ తన కెరీర్‌లో తొలిసారిగా 5 వికెట్లు (5/33) తీయడం విశేషం.  98 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా మరోసారి ఆసీస్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసి 277 పరుగులు చేసిన అనంతరం లుంగీ న్గిడి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు (5/42) పడగొట్టాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 193 పరుగులకే ఆల్‌అవుట్ అయి 84 పరుగుల తేడాతో మరో ఓటమి చవిచూసింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది.


ఆస్ట్రేలియా విషయానికి వస్తే వ‌న్డే ఫార్మాట్‌లో వారికి వరుస పరాజయాల పరంపరగా మారింది. గత ఎనిమిది వన్డేలలో ఏడు మ్యాచ్‌లు ఓడిపోవడం వారి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడం, బౌలర్లలో స్థిరత్వం లేకపోవడంతో ఆసీస్ వరుస ప‌రాజ‌యాలు ఎదుర్కొంటోంది. రాబోయే సిరీస్‌లలో గెలవాలంటే ఆస్ట్రేలియా జట్టు తన వ్యూహాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. ఏదేమైనా ఆసీస్ వ‌న్డే క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ ఛాంపియ‌న్ అయ్యి ఉండి వ‌రుస ప‌రాజ‌యాలు చూస్తుంటే వ‌న్డే క్రికెట్‌లో ఆ జ‌ట్టు తీరు మార‌క‌పోతే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా కోసం ఈ సిరీస్ విజయమే కాకుండా మానసిక బలాన్ని కూడా ఇచ్చింది. వరుస విజయాలు సాధించడం ద్వారా వారు ప్రపంచ వేదికపై మరోసారి తమ శక్తిని నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: