అధికార వైసీపీ దాడులకు నిరసన 36 గంటలపాటు ధర్మాగ్రహ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీక్ష విరమించారు. పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనూరాధ, గుమ్మడి సంధ్యారాణి, పీతల సుజాత, గౌతు శిరీషలు.. చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ లభించింది. ఈనెల 25న ఉదయం రాష్ట్రపతితో చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది. ఇక శనివారం మధ్యాహ్నానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్లు నిర్ధారణ కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని చంద్రబాబు కోరుతూ.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని విన్నవించారు. ఈ క్రమంలో ఈనెల 25న రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: