హైదరాబాద్‌ గంజాయి మాఫియా పడగ విప్పుతోంది. గంజాయి నివారణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కొత్తకొత్త మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్నారు. దీంతో కిరాణా షాపుల్లో చాక్లెట్లు దొరికినంత ఈజీగా గంజాయి దొరుకుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి ముఠాల ఆగడాలకు కళ్లెం వేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. గత నెల రోజుల నుంచి ఆపరేషన్‌ గంజాయి పేరుతో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ గంజాయి ముఠాల ఆట కట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా ౩౦౦ కిలోల గంజాయితో హైదరాబాద్‌ నుంచి వెళుతున్న లారీని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్‌ చేశారు. నర్సీపట్నం నుంచి అహ్మద్‌నగర్‌కు గంజాయిని తరలిస్తున్న స్మగ్లింగ్‌ గ్యాంగ్‌కు పోలీసులు తమదైన శైలిలో చెక్‌ పెట్టారు. డీసీఎం వ్యాన్‌లో కూరగాయల బాక్సుల పేరుతో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.

గంజాయి రవాణాకు కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు గంజాయి స్మగ్లింగ్‌ విధానాలను మారుస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గంజాయిని తరలించే సమయంలో.. డ్రైవర్లు కొంత దొంగిలించి.. జహీరాబాద్‌లో మరికొంత మంది డ్రైవర్లకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎక్కువగా ఒడిశాకు చెందిన యువకులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నట్టు తెలిపారు. నెల రోజులుగా జరుగుతున్న గంజాయి స్పెషల్ డ్రైవ్‌లో  78 కేసులు నమోదు చేశారు. 121 మందిని అరెస్ట్ చేశారు. 1480 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి ముఠాల ఆట కట్టించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా పోలీసుల కళ్లు గప్పి గంజాయి మాఫియా చెలరేగుతోంది. మైనర్లు కూడా గంజాయి సేవించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల పాతబస్తీలో వాహనాల తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. టూ వీలర్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆపి ప్రశ్నించారు. మైనర్లు అయిన వారిద్దరు గంజాయి కోసం పాతబస్తీకి వచ్చినట్లు తెలిపారు. దీంతో పోలీసులు విస్తుపోయారు. ఇలా పలుచోట్ల స్పెషల్ డ్రైవ్‌లో చాలా మంది పట్టుబడ్డారు. అయితే పోలీసులు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తున్నారు. గంజాయి కోసం వెళ్తూ పట్టుబడిన వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు. అయినా స్మగ్లర్లు తమ అక్రమ దందాను వారికి దగ్గరగా చేస్తూ.. మత్తు దిగకుండా చేస్తున్నారని, పోలీసులకు సవాల్‌గా మారుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: