జనసేన  అధినేత పవన్ కల్యాణ్ అంటేనే ఆవేశం. తన ఆవేశపూరిత మాటలతో జనాలను రెచ్చగొడుతూ ఉంటారు. ఏదైనా సభ లో కానీ సమావేశంలో కానీ ఊగుతూ.. సినిమా డైలాగుల మాదిరిగా పవన్ మాట్లాడుతారని.. ఆయన ఎప్పటికీ రాజకీయ నేత కాలేరని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. తాజాగా గాంధీ కి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కి మచిలీ పట్నంలో పవన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పరిణితి చెందిన నేతగా మాట్లాడారు.  


నాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. జగన్ ఆలోచన విధానంతోనే వ్యతిరేకిస్తానన్నారు. సీఎంతో కానీ, మంత్రులతో కానీ నాకు విభేదాలు లేవు.. పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తి చూపుతాను. అంతేకానీ ఆయన్ను తిట్టాలని, కించపరచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాగే కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వారు పెద్దన్న పాత్ర పోషించాలి అని పవన్ పిలుపునిచ్చారు.


దీంతో పాటుగా బీజేపీతో కలిసి వెళ్తే ఓట్లు, సీట్లు పెరుగుతాయి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానాలు సంపాదించలేం.  అధికారంలో లేకుంటే ఏమీ చేయలేం. అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చింది కాబట్టి వినియోగించుకుంటున్నాం అని పేర్కొన్నారు. దీంతో పాటు రెండు కులాల మధ్య ఘర్షణ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.   వాస్తవానికి కుల గొడవలు లేకుంటే విజయవాడ ప్రాంతం అభివృద్ధి చెందేది. కానీ ఇక్కడ గొడవల వల్ల హైదరాబాద్ కు చాలామంది వ్యాపార వేత్తలు తరలివెళ్లారు.


నేను ఏ కులానికి వ్యతిరేక  కాదు అని నిర్మాణాత్మక రాజకీయం, సామాజిక అభివృద్ధి చేయాలనేదే తన అభిమతమన్నారు. వేగంగా రాజధాని అభివృద్ధి అంటే జరిగే పనికాదన్నారు. దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఏది ఏమైనా గాంధీ జయంతి సందర్భంగా పవన్ మాట్లాడిన తీరు చాలా నిజాయతీగా అనిపించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: