తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ముందు ఇవాళ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో దీనిని అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లో చేరి కల్వకుర్తి నుంచి విజయం సాధించారు.


దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని బరిలో దింపగా.. బీఆర్ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని పోటీలో ఉంచింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాలు జిల్లాలు కాదు.. రాష్ట్రాలు దాటుతున్నాయి. పాలమూరు రాజకీయం గోవాకి చేరింది.


ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను గోవాకు తరలించారు. గోవా క్యాంపులో వీరంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. హోలీ సందర్భంగా రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు మందేస్తూ.. చిందేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. సుమారు వీరికి ఓటుకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఆయా పార్టీల అభ్యర్థులు ఆఫర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో..


మరోవైపు ఓటర్లకు డబ్బులతో పాటు వారి కుటుంబ సభ్యులను గోవా టూర్ కి తీసుకెళ్లారు. క్యాంపుల వద్ద ప్రత్యేక సమావేశాలు, విందులు, వినోదాలు వంటివి చేపట్టారు. వీటికి కేటీఆర్ కూడా హాజరై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. సుమారు  ఈ ఎన్నికలకు రూ.50-100 కోట్లు ఖర్చు పెట్టారని అంచనా. ఈ ఎమ్మెల్సీ సీటు వల్ల ఇరు పార్టీలకు పెద్దగా ఒరిగేదీ ఏమీ లేదు. కానీ ప్రస్టేజీ ఇష్యూ కోసం ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతున్నారు. పవర్ కోసం ఎంత ఆత్రుత, ఎంత పాకులాట ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: