రాష్ట్ర రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడిని జగన్మోహన్ రెడ్డి కలిసినా ప్రతిపక్షాలకు ఏడుపే. కలవకపోయినా ఏడుపే అన్నట్లుగా ఉందీ ప్రతిపక్షాల తీరు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రధాని-జగన్ మధ్య దాదాపు 50 నిముషాలు భేటి జరిగింది. భేటిపై అధికారికంగా వైసిపి ఇప్పటివరకు స్పందించలేదు.  అయితే ఎన్డీఏలో చేరాల్సిందిగా జగన్ను ప్రధానమంత్రి ఆహ్వానించారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో  చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్ధంకాక టీడీపీ నేతలు ఉదయం నుండి గింజుకుంటున్నారు.




పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏలో చేరమని ప్రధాని ఆహ్వానించినట్లు వైసిపి అబద్ధపు వార్తలు రాయించుకుంటోందంటూ గోల మొదలుపెట్టేశారు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే వైసిపి అబద్ధపు వార్తలే రాయించుకుంటోందనే అనుకుందాం. దీనికి స్పందించాల్సింది ఎవరు ? బీజేపీ అగ్రనేతలా ? లేకపోతే టీడీపీ నేతలా ? వైసిపిని ఎన్డీఏలో చేరమని ప్రధానమంత్రి ఆహ్వానించలేదంటు ఖండించాల్సింది బీజేపీ నేతలే కదా. మరెందుకు టీడీపీ నేతలు గొంతులు అరిగిపోయేలాగ గోల చూస్తున్నట్లు ?  అటు బీజేపీ ఇటు వైసీపీ బాగానే ఉన్నాయి. మధ్యలో టీడీపీ ఎందుకింత కంగారు పడుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎన్డీఏలో వైసీపీ చేరితే టీడీపీకి వచ్చే నష్టం ఏమిటి ? ఎన్డీఏలో చేరకపోతే వచ్చే లాభం ఏమిటి ?




వైసీపీ-ఎన్డీఏ విషయంలో టీడీపీకి కొత్తగా వచ్చే నష్టం లేదు, లాభమూ లేదు.  ఎందుకంటే చంద్రబాబునాయుడుకు జరగాల్సిన డ్యామేజి మొన్నటి ఎన్నికల్లోనే జరిగిపోయింది.  తనను నమ్మి మళ్ళీ ఎన్డీఏలో మోడి చేర్చుకుంటాడేమోనని  చంద్రబాబు చాలా ఆశతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడెపుడు  మోడి నుండో  లేకపోతే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుండి పిలుపొస్తుందా అని ఆశగా చంద్రబాబు ఎదురు చూస్తున్నాడు.  బీజేపీకి దగ్గరవుదామని చంద్రబాబు ఎంత ప్రయత్నాలు చేస్తే మోడి, షాలు అంత దూరంగా పెట్టేస్తున్నారు. దాంతో తమకు అవకాశం లేకపోయినా జగన్ మాత్రం ఎన్డీఏలో చేరకూడదని చంద్రబాబు+టీడీపీ నేతలు బాగా కోరుకుంటున్నట్లున్నారు. ఎలాగూ వీళ్ళను భుజాన మోసే ఎల్లోమీడియా ఉండనే ఉంది. అందుకనే తమలోని కోరికనంతా ఎల్లోబ్యాచ్ ఎల్లోమీడియా ద్వారా బయటపెడుతున్నారు.




జగన్ గనుక ఎన్డీఏలో చేరితే తమ సంగతేంటో వీళ్ళకి బాగానే అర్ధమవుతున్నట్లుంది. ఎన్డీఏలో చేరాలంటే జగన్ పెట్టబోయే షరతులేమిటో కూడా ఎల్లోబ్యాచ్ బాగానే ఊహించగలదు. వైసీపీ ఎన్డీఏలో చేరితే తమకు కష్టాలు మొదలైనట్లే అని మెంటల్ గా ఇప్పటికే ఫిక్సయిపోయింది ఎల్లోబ్యాచ్.  అయితే చివరినిముషం వరకు ప్రత్యర్ధులపై బురదచల్లటం, జనాలను మాయ చేయటం చంద్రబాబు+ఎల్లోబ్యాచ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో భాగంగానే ఎన్డీఏలో చేరమని మోడి అసలు జగన్ కు ఆహ్వానమే ఇవ్వలేదంటూ గోల చేస్తున్నారు.  ఎన్డీఏలో చేరటమా ? మానటమా ? అన్నది పూర్తిగా జగన్ ఇష్టాఇష్టాల మీద ఆధారపడుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.  ఎవరితో జట్టుకట్టాలి ? ఎప్పుడు జట్టుకట్టాలి ? అనే విషయాలపై జగన్ కు బాగానే క్లారిటి ఉంటుందని ఎల్లోబ్యాచ్ మరచిపోయినట్లుంది. కాబట్టి అనవసరమైన గోల మానేస్తే కనీసం గొంతునొప్పయినా  రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: