
పాలేరులో క్రితం సారి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి తదనంతర పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ హామీతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరినట్లు సమాచారం. కేసీఆర్ పీకే టీం ద్వారా చేయించిన సర్వేలో ఆయన పట్ల జనం వ్యతిరేకంగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. దీంతో తుమ్మల వైపు మొగ్గు చూపుతున్నారట. ఇదే నిజమైతే కందాళకు కేసీఆర్ మొండిచేయి చూపినట్లే. అప్పుడు ఆయన భవిష్యత్తు ఏమిటో తేలాల్సి ఉంది.
అయితే.. ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు తుమ్మల. పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నారు. తాను పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. నమ్ముకున్న పార్టీకి నష్టం చేసే వ్యక్తిత్వం తనది కాదని అన్నారు. పాలేరు బరిలో తానే ఉంటానని అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత తన కార్యాచరణను పెద్ద ఎత్తున అమలు చేయనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా నియోజకవర్గ పర్యటనలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించారు తుమ్మల. ఆయన నోటి వెంట అనూహ్యంగా ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ప్రస్తావన వచ్చింది. తాను విలువలకు కట్టుబడి ఉంటానని.. నమ్మిన పార్టీని మోసం చేయనని వెల్లడించారు. మనసు, వ్యవహారం మంచిగా ఉంటే రాజకీయాల్లో ఎవరైనా ఎదగొచ్చని అన్నారు. జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లో వచ్చిన కన్నబాబు ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.
తుమ్మల వ్యాఖ్యలతో అందరూ కన్నబాబు గురించి ఆయన నేపథ్యంపై ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఈనాడు పత్రికలో దాదాపు 20 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశారు కన్నబాబు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019లో అదే స్థానం నుంచి వైసీపీ తరపున విజయం సాధించి జగన్ కేబినెట్ లో వ్యవసాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలా తుమ్మల కన్నబాబు గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.