వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి కల్లూరు గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లాలో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది వైసీపీ నేతల పనేనని.. తాము ముందు నుంచీ చెబుతున్నామని.. ఈ కేసులో సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో పరిటాల రవి హత్య కేసు విషయంలోనూ ఇలాగే జరిగిందని.. ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలోనూ ఇలాగే జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు.


అయితే.. చంద్రబాబు చేస్తున్న ఈ ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదని... అలాంటి పరిస్థితుల్లో సాధారణ మరణంతో చనిపోయిన వ్యక్తులను కూడా వివేకా హత్యకేసుతో ముడిపెట్టి మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.


ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం, ఇతరులపై దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందిని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన తనయుడు లోకేశ్ బాబుకు కూడా ఇదే అలవాటు ఉందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పొత్తులపై మూడు ఆప్షన్లు ఎంపిక చేసుకోవడాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో వారి సత్తాపై వారికే నమ్మకం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి  వ్యాఖ్యానించారు.


కానీ. తమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో 95 శాతం హామీలను ప్రజలకు నెరవేర్చారని ఎంపీ విజయసాయి రెడ్డి  అన్నారు. అందుకే ఈసారి 175 స్థానాలను గెలుస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం ఉన్న తమకు ఎవరితో పొత్తులు అవసరం లేదని విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్ధతు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు..


వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 25న పార్టీ ఆద్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా పోస్టర్, వెబ్ సైట్ ను మరో ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి ఎంపీ విజయసాయి రెడ్డి  ఆవిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: