ఏపీలో పాఠశాలలు మొదలయ్యాయి. అదే సమయంలో అనేక బడుల వద్ద తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. తమకు దగ్గరగా ఉన్న స్కూళ్లను మూసేశారని.. దూరంగా ఉన్న స్కూళ్లకు వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పాఠశాలలను హేతబద్దీకరణ కారణంగా ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. పాఠ‌శాల‌ల ప్రారంభం రోజునే సీఎం నిర్ణయం ల‌క్షలాది మంది విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌కు శ‌రాఘాతంగా త‌గిలిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శిస్తున్నారు.


పేద‌పిల్లల‌కి ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి నారా లోకేశ్  లేఖ‌ రాశారు. ఆఘమేఘాల‌పై జాతీయ విద్యా విధానం అమ‌లు, పాఠ‌శాల‌ల విలీనంతో  తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థుల్ని ప్రభుత్వ విద్యకి దూరం చేస్తోందని నారా లోకేశ్ మండిపడుతున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు కొర‌త‌, అర‌కొర సౌక‌ర్యాల‌తో ప్రభుత్వ విద్యాల‌యాలు కునారిల్లుతున్నాయని నారా లోకేశ్  అంటున్నారు. ఇప్పుడు పాఠశాల‌ల విలీన నిర్ణయం మూలిగే న‌క్కపై తాటిపండు ప‌డ్డ చందంగా త‌యారైందని నారా లోకేశ్ విమర్శించారు.


జాతీయ విద్యా విధానం అమ‌లుని ఇంకా ఏ రాష్ట్రం ఆరంభించ‌కుండానే స‌మ‌స్యల‌పై ఎటువంటి అధ్యయ‌నం లేకుండా మ‌న‌రాష్ట్రంలో ఆరంభించ‌డమేంటని నారా లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. దీని  వలన బ‌డికి దూర‌మైన విద్యార్థులు రోడ్డున ప‌డ‌టం చూశామని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ‌శాల‌ల‌ను విభ‌జించాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం స్పష్టం చేసిందని.. దాన్ని ప‌ట్టించుకోని జగన్ ప్రభుత్వం పాఠ‌శాల‌ల‌ను విభ‌జించ‌డంతో స‌మ‌స్య  తీవ్రమైందని నారా లోకేశ్ మండిపడ్డారు.


జాతీయ విద్యావిధానం అమ‌లు చేసే తొంద‌ర కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ని త‌గ్గించే ఆత్రుత జగన్‌లో ఎక్కువగా క‌నిపిస్తోందని నారా లోకేశ్  విమర్శించారు. 117 GO అమ‌లు వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్దీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్రభుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. లోకేశ్ విమర్శించారని కాకపోయినా.. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి.. తల్లిదండ్రుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలి. సరైన పరిష్కారం చూపించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: