వంగవీటి మోహన రంగా.. ఆయన మరణించి దశాబ్దాలు గడిచినా.. ఇంకా ఆయన పేరు ఏపీలో మారుమోగుతూనే ఉంది. తాజాగా ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి రంగా జీవన ప్రస్థానం చర్చకు వచ్చింది. మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రంగాకు కులం, మతం, పార్టీ లేదు... అందరూ నేటికీ ఆరాధిస్తూనే ఉన్నారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పదవులు వస్తూ పోతూ ఉంటాయని.. అవి ఐదేళ్ల వరకే ఉంటాయని.. కానీ తనకు రంగా అబ్బాయిగా ఉండటమే గొప్ప అని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. తన తండ్రి ఆశయాల‌ కోసం, ప్రజలకు మేలు చేసేలా నేను పని చేస్తూనే ఉంటానని వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు.


పేద ప్రజల కోసం, నమ్ముకున్న సిద్దాంతాల కోసం వంగవీటి మోహనరంగా ప్రాణ త్యాగం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. మూడేళ్లు ఎమ్మెల్యే గా పని‌చేసి ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగా అని అన్నారు. రంగాను ధైర్యం గా ఎదుర్కోలేక నిరాహారదీక్ష లో ఉన్న సమయం చూసి చంపారని కొడాలి నాని గుర్తు చేసుకున్నారు. రంగా వారసుడిగా రాధాకృష్ణ నిజాయితీ గల నేతగా పేరు సంపాదించారని కొడాలి నాని కొనియడారు. ప్రజా జీవితంలో తండ్రి ఆశయాల‌ కోసం రాధా పని‌ చేస్తున్నారని కొడాలి నాని పేర్కొన్నారు.


ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక‌ వ్యక్తి రంగా అని వర్థంతి కార్యక్రమంలో ఎంపి బాలశౌరి వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా రంగాని ఆరాధిస్తూనే ఉన్నారని, రాష్ట్రం మొత్తం ఆయన శక్తి ఏమిటో అందరికీ  తెలుసుని బాలశౌరి అన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ కూడా మంచి పదవులతో ప్రజలకు సేవ చేయాలని బాలశౌరి ఆకాక్షించారు.  పేద ప్రజల మనిషి రంగ, అందుకే 35యేళ్ల తరువాత కూడా స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  తెలిపారు. రంగా మరణం లేని మనిషి.. ఇప్పటికి నిత్య జీవితంలో లో రంగా హీరో అని వంశీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: