
శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పదే పదే తన పేరును ప్రస్తావించడంతో పార్టీ మారుతారనే జరుగున్న ప్రచారంలో వాస్తవం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేసేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి విధేయుడిగానే కొనసాగుతానని ఈటల రాజేందర్ వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటల... తాను అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా స్పందించినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగడం సరైందికాదని అన్నారు.
శాసనసభకు జరుగబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలను అవమానపరిచేటట్లు అధికార పార్టీ వ్యవహారిచిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. మందబలం ఉందని తమను తిట్టేపని పెట్టుకున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో చోటుచేసుకున్న లోపాలను సవరించాలని కోరినా పట్టించుకోలేదని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యోగులెవరూ మానసికంగా సంతోషంగా లేరని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఈటల రాజేందర్ వివరించారు.
కానీ.. ఉన్నట్టుండి ఇలా కేసీఆర్ ఈటల రాజేందర్‌ను మెచ్చుకున్నట్టు మాట్లాడటం.. పదే పదే ఆయన పేరు ప్రస్తావించడం మాత్రం అనేక ఊహాగానాలకు తెర తీస్తోంది. ఇందులో ఇంకేమైనా వ్యూహం ఉందా అన్న చర్చ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ సాగుతోంది.