కొండగట్టు అంజన్న ఆలయాన్ని అద్భుతంగా మారుస్తామని సీఎం కేసీఆర్ మొన్న ప్రకటించారు. అదే విధంగా రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేశారు. యాదాద్రిని కూడా బాగు చేస్తామని చెప్పి ఇప్పటివరకు చాలా వరకు నిర్మాణాలు జరిగిపోయాయి. ప్రస్తుతం రాబోయేది శ్రీరామనవమి. భద్రాచలంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ప్రస్తుతం సీతారామ స్వామి ఆలయానికి సంబంధించి శ్రీరామనవమి వేడుకలను నిర్వహించేందుకు చందాలు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఆలయానికి రావాల్సిన నిధులను, ఇప్పటి వరకు కేటాయించాల్సిన నిధులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పండగ ఏర్పాట్లు చేయలేని పరిస్థితి. భద్రాచలంలో ఉన్న ఈ సీతారామ ఆలయానిది ఏళ్ల చరిత్ర. ప్రతి శ్రీరామనవమికి ప్రభుత్వం పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీ. తలంబ్రాలు తీసుకెళ్లడం కూడా ఒక పద్ధతి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సింది. కానీ ఇప్పటివరకు దేవాదాయ శాఖనే ఆ ఖర్చును భరిస్తున్నట్లు తెలుస్తోంది.


బ్రహ్మెత్సవాలకు విరాళాలు ఇవ్వాలని భక్తులను కోరింది దేవస్థానం. దీనికి కారణం ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం అని తెలుస్తోంది. భద్రాచలం ఆలయానికి  ప్రభుత్వం 2016 లో రూ.100 కోట్లు ప్రకటించినా ఇప్పటికి వాటిని మంజూరు చేయకపోవడం దారుణం. వాటిని 2017 లో ఇస్తామని చెప్పినప్పటికీ ఇంకా ఇవ్వలేరు.


యాదాద్రిని ఎలాగైతే బాగు చేశారో.. దీన్ని కూడా అలానే చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. కానీ సీతారామ ఆలయంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. కొన్ని వందల కోట్ల రూపాయాలను కేటాయించి ప్రత్యేక శిలలను తెప్పించి వాటితో నూతన ఆలయాన్ని కట్టారు. పార్కింగ్, భక్తులకు వసతి సౌకర్యాలు, కోనేటి సదుపాయం, ఆలయ విశిష్టత తెలిసేలా ఇలా ఎన్నో చేశారు. భద్రాచలంలో కూడా సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఇలాగే అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR