కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అమెరికాకు వెళ్ళటానికి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సుజనాను ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కకుండా  అడ్డుకున్నారు. 2019లోనే సుజనా పై సంబంధిత అధికారులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. లుకౌట్ నోటీసు జారీ చేయటమంటే విదేశాలకు వెళ్ళకుండా అడ్డుకోవటమే. వివిధ బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న సుజనా ఎగొట్టారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. మారిషస్ బ్యాంకు నుండి రూ. 108 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కేసులు కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు జరీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మారిషస్ బ్యాంకు నుండే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు తదితరల బ్యాంకుల నుండి కూడా సుజనా అప్పులు తీసుకున్నారు. అప్పులైతే తీసుకున్నారు కానీ తీసుకున్న అప్పులు మళ్ళీ తీర్చలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.




బ్యాంకు రుణాలు ఎగొట్టిన ఆరోపణలపై సుజనా పై 2018లోనే మూడు కేసులు నమోదయ్యాయి. అనేకసార్లు సుజనా ఇళ్ళు, ఆఫీసులపై 2019కి ముందు అనేకసార్లు దాడులు కూడా జరిగాయి. సీబీఐ, ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, ఐటి శాఖలన్నీ చాలాసార్లు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. 2018లోనే సుజనా ఆస్తులను బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలానికి కూడా పెట్టింది. విలువైన బెంజి, ఫెరారీ, రోవర్ కార్లను కూడా స్వాధీనం చేసుకుంది. షెల్ కంపెనీలను పెట్టి మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు సుజనాపై ఈడీ కేసులు పెట్టి విచారణ జరుపుతోంది. సుజన ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న కంపెనీల్లో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రాడక్ట్స్, సుజనా టవర్స్ లాంటివి  మొత్తం 102 కంపెనీలున్నట్లు సమాచారం.




సుజనా ఆధ్వర్యంలోనే నడుస్తున్న విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్ సిటి, లక్ష్మీ గాయత్రి, బెస్ట్ అండ్ కాంప్టన్ మినహాయిస్తే మిగిలినవన్నీ షెల్ కంపెనీలే అని సాక్షి మీడియా చెప్పింది. ఈ కంపెనీలన్నీ సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్గింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేతల్లో దిట్టలుగా సదరు మీడియా ఆరోపించింది.  సుజనా గ్రూపు సంస్ధలు వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల నుండి సుమారు రూ. 8 వేల కోట్లు అప్పులు తీసుకుంది. అసలు సుజనాను 2019కి ముందు టీడీపీలో ఉన్నపుడే సీబీఐ అరెస్టు చేయటానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అందుకనే చంద్రబాబునాయుడు సీబీఐకి రాష్ట్రంలోని నో ఎంట్రీ అంటు ఉత్తర్వులు జారీ చేశారు. లేకపోతే అప్పట్లేనే అరెస్టయి ఉండేవారని ప్రచారం.




దానికి తగ్గట్లే మొన్నటి  ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో వెంటనే రాజ్యసభ ఎంపిలైన  సుజనా, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ బీజేపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నలుగురు ఎంపిలు కమలం కండువా కప్పుకున్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. విచిత్రమేమిటంటే ఎప్పుడైతే ఈ నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి చేరిపోయారో అప్పటి నుండి సుజనాపై కేంద్ర దర్యాప్తు సంస్ధల దాడులన్నీ ఆగిపోయాయి. గడచిన ఏడాదిన్నర తర్వాత సుజనా వార్తల్లోకి  ఈ రకంగా ఎక్కటం ఇదే మొదటిసారి. సరే తనపైప జారీ అయిన లుకవుట్ నోటీసులు అక్రమమని వెంటనే వాటిని రద్దు చేయాలని సుజనా కోర్టులో కేసు వేశారు. తాను అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఉందని సుజనా తన పిటీషన్లో చెప్పారు.  దాంతో రెండు వారాల్లో అమెరికాకు వెళ్ళి రావాలని కోర్టు అనుమతిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: