మెగాస్టార్ చిరజీవి గురించి జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయం సంచలనంగా మారింది. ఇంతకీ నాదెండ్ల చెప్పిన విషయం ఏమిటంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా తొందరలోనే చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారట. అలాగే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్ధి పోటీలో ఉంటే చిరంజీవి ప్రచారం చేస్తారని కూడా నాదెండ్ల చెప్పినట్లు జనసేన వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. పవన్ కు నైతిక మద్దతే కాదని అవసరమైతే సంపూర్ణమద్దతుగా నిలబడేందుకు మళ్ళీ రాజకీయాల్లోకి చిరంజీవి వస్తాడని జనసేన నేతలు భావిస్తున్నారు. మొత్తానికి చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై ఎప్పటి నుండో జనాల్లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా నాదెండ్ల చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి మరింత మద్దతు లభించినట్లయ్యింది.




ఇక చిరంజీవి తిరుపతి ఉపఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేస్తాడని అనుకుంటున్నారు ? ఎందకంటే 2009లో చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నుండి గెలిచారు కాబట్టే. అప్పట్లో తిరుపతితో పాటు నర్సాపూర్ లో కూడా చిరంజీవి పోటీ చేశారు. నిజానికి నర్సాపూరం చిరంజీవి అత్తారిల్లు. అయితే విచిత్రంగా నర్సాపురంలో ఓడిపోయిన చిరంజీవి ఎటువంటి సంబంధంలేని తిరుపతిలో మాత్రం గెలిచారు. కేవలం చిరంజీవి కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తవటం, తిరుపతిలో బలిజలు ఎక్కువగా ఉండటమే మెగాస్టార్ గెలుపుకు కారణమైంది. అయితే తిరుపతి నుండి గెలిచినా తర్వాత తిరుపతి అభివృద్ధి కోసం చిరంజీవి చేసిందేమీ లేదనే చెప్పాలి. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేసిన తర్వాత రాజ్యసభ సభ్యునిగాను తర్వాత కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అయినా తిరుపతికి, చిత్తూరు జిల్లాకు ఏమీ చేయలేదు.




ఇటువంటి చిరంజీవి తిరుపతిలో జనసేన అభ్యర్ధి పోటీ చేస్తే ప్రచారానికి వస్తే ఏదో అద్భుతం జరిగిపోతుందని జనసేన నేతలు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. చిరంజీవి రాజకీయాలకు పనికిరాడన్న విషయం ఎప్పుడో తేలిపోయింది. అన్నలాగే తమ్ముడు కూడా సేమ్ టు సేమ్. అన్న పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కనీసం ఒక్క చోటన్నా గెలిచారు. తమ్ముడు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడయ్యుండి, పైగా సెలబ్రిటి హోదాలో ఉండి  కూడా రెండు చోట్లా ఓడిపోయారంటే జనాలు పవన్ను ఎంతలా తిరస్కరించారో అర్ధమైపోతోంది. మరి చరిత్ర తెలిసి కూడా నాదెండ్ల చిరంజీవి గురించి ఎందుకు వ్యాఖ్యలు చేశారో అర్ధం కావటం లేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: