
అసైన్డ్ భూముల కుంభకోణంలో అప్పటి ఉన్నతాధికారులు పూర్తిగా ఇరుక్కున్నారా ? లేకపోతే చంద్రబాబునాయుడే అప్పటి ఉన్నాధికారులను ఇరికించేశారా ? కోర్టులో శుక్రవారం జరిగిన వాదనలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పై రెండు ఆప్షన్లను జాగ్రత్తగా గమనిస్తే రెండో ఆప్షనే వాస్తవమని అర్ధమైపోతోంది. ఎందుకంటే చంద్రబాబు తరపున లాయర్ వాదనలు వినిపిస్తు జీవో నెంబర్ 41 జారీతో మాజీమంత్రి నారాయణకు, చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు. చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా, నారాయణ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇద్దరి తరపున లాయర్లు వినిపించిన వాదనల సారంశం ఏమిటంటే అసైన్డ్ ల్యాండ్ ను ప్రభుత్వం తీసుకోవటంలో మంత్రి, చంద్రబాబుకు సంబంధం లేదని. సీఆర్డీయే కమీషనర్+ఇతర ఉన్నతాధికారులే మొత్తం వ్యవహారం నడిపించారట. జీవో జారీ అయిన విషయం అసలు చంద్రబాబు, నారాయణకు తెలీనే తెలీదట.
జీవో నెంబర్ 41 జారీ అయిన 35 రోజుల తర్వాత మాత్రమే సదరు జీవో విషయం చంద్రబాబు దృష్టికి వచ్చిందట. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి కారణంగా జీవోను సవరించారట. జీవో విడుదలకు సంబంధించిన చర్చలు, విడుదల ప్రక్రియలో చంద్రబాబు, నారాయణ ప్రమేయమే లేదట. మొత్తానికి చంద్రబాబు, నారాయణ తరపున లాయర్లు వినిపించిన వాదనల ప్రకారం మొత్తం వ్యవహారమంతా సీఆర్డీయే కమీషనర్, గుంటూరు జిల్లా కమీషనరే నడిపించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పటి అమరావతికి సంబంధించిన ఎంత చిన్న విషయమైనా చంద్రబాబుకు తెలీకుండా జరిగే అవకాశమే లేదు. చంద్రబాబుకు తెలీకుండానే జీవోలు జారీ అయిపోయి అమల్లోకి వచ్చేశాయంటే ఎవరు నమ్మరు. అయితే లాయర్ల వాదనల ప్రకారం చూస్తుంటే తమ చేతికి మట్టంటకుండా చంద్రబాబు, నారాయణలు మొత్తం వ్యవహరాలను ఉన్నతాధికారులతోనే జరిపించేశారని అర్ధమవుతోంది.
తెరవెనుక ఎవరున్నారు ? తెరముందు ఎవరున్నారు ? అన్న ప్రతి విషయం జనాలకు బాగా తెలుసు. లాయర్ల వాదనలు విన్న కోర్టు సీఐడీ విచారణ ముందుకు సాగకుండా స్టే ఇవ్వచ్చు. కానీ జరిగిందేమిటి అనే విషయం జనాలందరికీ తెలుసు. కాకపోతే సాంకేతికంగా పెద్దలిద్దరి పాత్రను ఇప్పటికిప్పుడు నిరూపించలేకపోవచ్చు. ఇందుకనే సీఐడీ ఉన్నతాధికారులు అప్పటి సీఆర్డీయే కమీషనర్ నాగులపల్లి శ్రీకాంత్+ఇతరులను విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల విచారణలో ఏమి తేలుతుందో, చివరకు ఏమి తేలుస్తారో చూడాల్సిందే.