తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో కాపులకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లన్నీ ఇప్పటి వరకూ టీడీపీకే పడుతూ వచ్చాయనే ప్రచారం ఉంది. ఇప్పుడా ఓటు బ్యాంకుని తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పవన్ కల్యాణ్. ఉప ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని జనసేనకే ఇవ్వాలని అందుకే పట్టుబట్టారు. అయితే చివరి నిముషంలో ఆ ప్రయత్నం బెడిసికొట్టి, బీజేపీ తామే సొంతంగా పోటీ చేస్తామని చెప్పింది. అభ్యర్థి విషయంలో పవన్ కల్యాణ్ సలహాలు కూడా తీసుకోవడంతో.. ఆయన సులభంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తిరుపతిలో పవన్ ఆశిస్తున్నట్టు కాపుల ఓట్లన్నీ బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు పడతాయా లేదా అనేది అనుమానం.

ఆమధ్య తిరుపతి రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ కాపుల ఓట్లను టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. తిరుమల కొండపై దుకాణాలు నడుపుకునే కాపులను హింసిస్తున్నారని, వారిని టార్గెట్ చేస్తున్నారని, కాపులు మృదు స్వభావులని చెప్పుకొచ్చారు. అయితే ఆవెంటనే వైసీపీ నుంచి పవన్ కు కౌంటర్ పడింది. అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి పేర్ని నాని కాపుల గురించి పవన్ మాట్లాడటాన్ని తీవ్రంగా విమర్శించారు. కాపులకు మేలు జరిగింది, లబ్ధి చేకూరింది ఒక్క వైసీపీ హయాంలోనేనని అన్నారు.

కాపులు పవన్ వెంటే ఉంటారా..?
తిరుపతి ఉప ఎన్నికల్లో కాపులు పవన్ వెంటే ఉంటారనే ప్రచారం జోరందుకుంది. గతంలో కూడా ఇదే స్ట్రాటజీతో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఆయనకు దక్కిన ఫలితం వేరు. మరి అప్పటికి, ఇప్పటికి ఆ సామాజికవర్గంలో ఏదైనా మార్పు వచ్చిందా, తమకోసం వచ్చిన బలమైన నాయకుడు పవన్ కల్యాణే అని వారు నమ్ముతున్నారా అనేది తిరుపతి ఉప ఎన్నికలతో బయటపడుతుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమాల పరంగా పవన్ ని విపరీతంగా అభిమానించేవారు సైతం.. ఎన్నికలొచ్చే సరికి ఆయనకు ఓట్లు వేయడంలేదు. అదేరకంగా.. సామాజిక వర్గం పరంగా పవన్ తమవాడేనని చెప్పుకోడానికి ఇబ్బంది పడనివారంతా.. ఎన్నికల్లో పవన్ కే మద్దతు తెలుపుతారా అనేది తేలాల్సి ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి వచ్చే ఓట్ల ఆధారంగా ఈ విషయంపై ఓఅవగాహనకు రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: