ఏపీ అప్పుల కుప్పలా మారిపోతోందని కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, భారీగా అప్పులు తెస్తున్నారని గోల చేస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో దీనిపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతోంది. సీఎం జగన్ కార్యదర్శి కూడా తప్పంతా గత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు.

2014-19 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం 59.44 శాతం అప్పులు చేస్తే, అదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 122.40శాతం మేర అప్పులు చేసిందని అన్నారు సీఎం జగన్ కార్యదర్శి దువ్వూరి కృష్ణ. అప్పుల పాపమంతా టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఇటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటీవల జరుగుతున్న అప్పుల ప్రచారంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అప్పుల పేరుతో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు. అదే సమయంలో అప్పులు తెస్తున్నా సంక్షేమ కార్యక్రమాలకోసమే కదా అని సమర్థించుకుంటున్నారు.

ఇప్పటికే ఏపీ పరిమితికి మించి అప్పులు తెస్తోంది అనే ప్రచారం ఉంది. భవిష్యత్తులో ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదు అని చెబుతున్నారు కూడా. అదే జరిగితే ముందున్న సంక్షేమ పథకాలకు నిధులు సమకూరేదెలా..? కరోనా కష్టకాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. మధ్యప్రదేశ్ లాంటి చోట్ల.. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లపాటు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. జీతాల ఖర్చుని సగానికి సగం తగ్గించుకోడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దశలో ఏపీలో మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఏ వర్గాన్నీ నిరాశపరచలేదు. కరోనా కష్టాల్లో కూడా నిరుపేదలకు అందే ఆర్థిక సాయం ఆగలేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలయినా కొన్నిరోజులు ఆలస్యం అవుతున్నాయి కానీ, సామాజిక పింఛన్లు మాత్రం ఠంచనుగా ఒకటో తేదీనే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందుతున్నాయి.

ప్రస్తుతానికి పరిస్థితి బాగానే కనిపిస్తున్నా.. అప్పుల భారం మరీ ఎక్కువై, అసలు బయట అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడితే సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి..? ఉద్యోగాల జీతాలు ఆలస్యమైతే సర్దిచెప్పుకున్నారు కానీ, రేపు పింఛన్లు ఆలస్యమైనా, ఇతర పథకాలు కొన్నిరోజులు లేటయినా ప్రతిపక్షాలు మాత్రం విమర్శలతో విరుచుకుపడతాయి. ఇలాంటి పరిణామాలను జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: