రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. ప్రధాని ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందిచడానికి ఈసీ నిరాకరించింది. నో కామెంట్ అంటూ ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి సమాధానం ఇవ్వడం గమనార్హం.


మరోవైపు ప్రధాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించిననందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఈసీకి కలిసింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చే విధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని మోదీ మాట్లాడారు అని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఏ ప్రధాని కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.


ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందని.. మతపరమైన సెంటిమెంట్ విద్వేషాన్ని ప్రధాని మోదీ వెళ్లగక్కుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. మతం పేరిట ఓట్లు అడిగారంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం 1999లో  ఆయనపై నిషేధం విధించింది. ఆరేళ్ల పాటు ఓటేయకుండా.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.


ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఈడీ ఎందుకు నిషేధం విధించడంలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం పాత్రపై పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎన్నికల నియామవళి ప్రకారం ఎన్నికల ప్రచారానికి మతాలకు సంబంధించిన గుర్తులు ఉపయోగించడం, మతం , కులం, తెగల ఆధారంగా ఓట్లు అడగడం నిషిద్ధం. ఇప్పటి దాకా ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించలేదు. అలాగే మోదీ వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చినట్లు కానీ.. చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి సమాచారాన్ని ఈసీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: