కొంతకాలం క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒక వింత వ్యాధి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పుడు అక్కడి ప్రజలు కరోనా వైరస్ మహమ్మారితో ఒకపక్క అలాగే ఈ వింత వ్యాధితో మరోపక్క తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతం అయ్యారు. మరలా ఇప్పుడు మరోసారి పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. అక్కడి జనాలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. గ్రామంలో మొత్తం 13మంది అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా వరుసగా జనాలు అస్వస్థతకు గురికావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు కొమిరేపల్లిలో పరిస్థతిని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పరిశీలించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. ఈ ఘటనపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏలూరు, పూళ్లలో కొంతమంది అస్వస్థతకు గురయ్యారని.. వారికి వైద్యం అందించాం, కోలుకున్నారు.. అందరూ సురక్షితంగా ఇంటికి వెళ్లిపోయారన్నారు.




గురువారం రాత్రి నుంచి దెందులూరు నియోజకవర్గంలో కొమిరేపల్లిలో పరిమితమైన ప్రాంతంలో మూర్చ, నోటి నుంచి నురగ వచ్చిందన్నారు. మెడికల్ క్యాంపుల్లో బాధితులు ట్రీట్మెంట్ తీసుకుని.. కోలుకున్న వెంటనే ఇంటికి వెళ్లిపోతున్నారన్నారు. బాధితులకు వైద్యం అందిస్తుంటే.. ఆస్పత్రులకు తరలిస్తుంటే కొంతమంది అడ్డుకున్నారని నాని మండిపడ్డారు. ఈ వింత వ్యాధిపై ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి.. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయని.. ఆ అనుమానానికి బలం చేకూరేలా ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు నిరసన తెలియజేయొచ్చు.. కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్ష నేతలు ఇలా చేయడం సరికాదన్నారు. గతంలో రాజకీయాల కోసం దేవుళ్లను లాగారు.. ఇప్పుడు జనాల్ని లాగుతున్నారన్నారు. జనం రోగాలతో ఇబ్బందిపడుతుంటే పార్టీలొచ్చి గొడవ చేస్తున్నాయని.. కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఈ అంతు చిక్కని వ్యాధి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. సీఎస్ వెంటనే వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఆదిత్యనాథ్ దాస్, ఇతర అధికారులు హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్ళారు. ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం పూర్తి అప్రమత్తం చేయడంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ సునంద, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షూ శుక్లా వెళ్లారు. గ్రామంలో రెండు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి శానిటేషన్ పనులు చేపట్టడమే కాకుండా మెడికల్ సిబ్బంది ఇంటింటికి సర్వే చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: