
మరి ఈ నీరా ఎలా తీస్తారు?.. ‘‘ నీరాను ప్రధానంగా ఖర్జూర,జీలుగ తాటి, ఈత చెట్ల నుంచి తీస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత కొత్త కుండను తినే సున్నపుతేటతో శుభ్రంగా కడిగి అది ఆరిన తర్వాత కొంత సున్నపుతేటను కుండలో వేసి సాయంత్రం సమయంలో చెట్టుకు అమర్చుతారు. సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోదయం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది. కొబ్బరి నీళ్లకంటే ఇది ఎంతో శ్రేష్ఠంగా, రుచికరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరా అమ్మకాలకు అనుమతిస్తూ జీవోఎంఎస్ 116ని జారీ చేసింది.
హుస్సేన్ సాగర్ తీరంలోని నెక్లస్ రోడ్‌లో నీరా కేఫ్ని ఏర్పాటుకు ప్రభుత్వం స్ధలం కేటాయించి, శంకుస్ధాపన కూడా చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కేఫ్ నిర్మాణం తరువాత దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ నీరా ఉత్పత్తి, సరఫరా చేస్తామని ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. నీరాకు కల్లుకు తేడా ఉంది. నీరాలో కల్లులో ఉన్నట్టు కిక్ ఉండదు కనుక నిషా వచ్చే అవకాశాలులేవు. అయితే ఈత,తాటి చెట్ల నుండి తీసిన నీరాను ఎక్కువ రోజులు నిల్వచేసే అవకాశాలు లేకపోవడంతో శాస్త్రీయంగా నిల్వచేయడానికి తెలంగాణ నీరా తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ గత 3 సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది.
చెట్ల నుండి తీసిన నీరాను శుద్ధిచేసి బాటిళ్ల్లలో నింపి శీతలీకరిస్తే మూడు నుంచి ఆరునెలల వరకు నిల్వచేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.