వైసీపీ అధికారంలోకి వచ్చాక...ఎక్కువ ఆధిపత్యపోరు నడుస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది...నెల్లూరు జిల్లానే. ఇక్కడ మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. అయితే మొత్తం వైసీపీ డామినేషన్ ఉండటంతో, వారిలో వారికి పడటం లేదు. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గానికి సీనియర్ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం రామ్ నారాయణరెడ్డి వర్గానికి పెద్దగా పొసగడం లేదు.

 

ముఖ్యంగా కోటంరెడ్డి విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలు గుర్రుగానే ఉంటున్నారు. ఆ మధ్య కూడా కాకానికి, కోటంరెడ్డిల మధ్య చిన్న ఇష్యూ కూడా నడిచింది. అయితే ఆ ఆధిపత్య పోరు వ్యవహారం ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. అవి ఇంకా అలాగే నడుస్తూనే ఉన్నాయి. అయితే ఆధిపత్య పోరు వ్యవహారం ఎలా ఉన్నా, నెల్లూరు రూరల్ లో మాత్రం కోటంరెడ్డి బలం మాత్రం తగ్గలేదు. 2014, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీలతో గెలిచిన కోటంరెడ్డి...ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు.

 

ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఇక మంత్రి అనిల్ సపోర్ట్ ఉండటంతో, మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాకపోతే నియోజకవర్గంలో ఇసుకలో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డి పేరు చెప్పుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని టాక్. ఇక ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అటు టీడీపీ తరుపున మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పనిచేస్తున్నారు. ఆయన మొన్న ఎన్నికల్లో కోటంరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ టీడీపీలో గ్రూపులు ఎక్కువగా ఉండటం కోటంరెడ్డికి ధీటుగా అజీజ్ ఎదగలేకపోతున్నారు. అదే సమయంలో వైసీపీలో కూడా ఆధిపత్య పోరు ఉన్నా సరే  రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డికి తిరుగులేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: